రాజ్ నాథ్ కాళ్లు ప‌ట్టుకున్న డీజీపీ

Update: 2017-11-01 17:25 GMT
అందుబాటులోకి వ‌చ్చిన టెక్నాల‌జీతో వెర్రి వేషాలు వేయ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతోంది. అందుకు నిద‌ర్శ‌నంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. ఫోటో మార్ఫింగ్ తో ఎదుటోళ్ల మీద బుర‌ద జ‌ల్లే అల‌వాటు ఈ మ‌ధ్య పెరుగుతోంది. తాజాగా అలాంటి మార్ఫింగ్ ఫోటో చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు.

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సోఫోలో కూర్చుంటే.. ఆయ‌న కాళ్ల‌ను గుజ‌రాత్ డీజీపీ ప‌ట్టుకున్న ఫోటో సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది.ఈ ఫోటోలో రాజ్ నాథ్ సీరియ‌స్ గా ఉంటే.. డీజీపీ కాళ్లు ప‌ట్టుకున్న తీరు షాక్‌కు గురి చేసేలా ఉంది. ఈ ఫోటో కింద ఇచ్చిన రైట‌ప్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాల్సిందే.  

స‌ద‌రు ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇది చూశాక కూడా గుజ‌రాత్ ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా జ‌రుగుతాయ‌న్న న‌మ్మ‌కం నాకు లేదు.. ఎవ‌రిని న‌మ్మాలో అర్థం కావ‌టం లేదంటూ ట్వీట్ చేశాడో వ్య‌క్తి. ఆలంగిర్ రిజ్వీ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో పెను దుమారాన్నే రేపింది.

ఈ ఫోటో వైర‌ల్ కావ‌ట‌మే కాదు ట్వీట్లు.. రీట్వీట్ల‌తో హోరెత్తిపోయింది. చివ‌ర‌కు ఈ ట్వీట్ పై కాంగ్రెస్ జాతీయ ప్ర‌తినిధి సంజ‌య్ ఝూ సైతం రియాక్ట్ అయి.. ఇది నిజ‌మైన ఫోటో అయితే చాలా దారుణం.. షాక్‌కు గురి చేస్తుంద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ ఫోటో న‌కిలీద‌ని.. 2011లో మాజీఐపీఎస్ అధికారి యోగేశ్ ప్రతాప్ సింగ్ తీసిన క్యా యే స‌చ్ హై చిత్రానిద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దీంతో అప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌చారానికి భిన్న‌మైన స్పంద‌న మొద‌లైంది. ఈ ఫోటోను పోస్ట్ చేసిన రిజ్వీని ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు. సారీ చెప్పి.. ఫోటోను డిలీట్ చేయాల‌న్నారు. చివ‌ర‌కు కాంగ్రెస్ జాతీయ ప్ర‌తినిధి ఝూ సైతం త‌న ట్వీట్‌ను ఉప‌సంహ‌రించుకొన్నారు. మ‌రో ట్వీట్ తో ఈ ఫోటోను తీసేయాల‌ని కోరారు. ఎవ‌రెన్ని చెప్పినా రిజ్వీ  మాత్రం ఫోటోను త‌న ఖాతా నుంచి తీయ‌లేదు. అర్థం లేని ఫోటోలు.. అపార్థాలు పెంచే ఈ త‌ర‌హా ఫోటోల్ని పోస్ట్ చేసిన వారిపై చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.
Tags:    

Similar News