ఏపీలో రేషన్ కార్డుల జల్లెడ!

Update: 2019-08-07 11:46 GMT
ఈ రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతకు అంతా రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పొందాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే, రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వ సంక్షేమ పథకానికి అర్హత కలిగి ఉన్నట్టే. ఈ నేపథ్యంలో చాలా మంది అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయనేది తెలిసిన విషయమే.

అంటే ఆర్థికంగా మంచి స్థితిగతులను కలిగి ఉండి కూడా రేషన్ కార్డులను కలిగి ఉన్నారు అనేక మంది. ఎన్నికల సమయాల్లోనూ ఎడా పెడా కార్డులు ఇచ్చేస్తూ ఉంటారు, ఇక మిగిలిన సందర్భాల్లో కూడా సరైన పరిశీలన లేకుండానే రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలూ ఉంటాయి.

ఇలాంటి నేపథ్యంలో అలాంటి అనర్హులను జల్లెడ పట్టే పని చేపట్టింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. భారీ ఎత్తున రేషన్ కార్డులను రద్దు చేశారు. ప్రస్తుతానికి లక్షా నలభై వేల రేషన్ కార్డులను ఇన్ యాక్టివ్ స్టేటస్ లో ఉంచారని తెలుస్తోంది. వారంతా మంచి ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నా రేషన్ కార్డులు కలిగి ఉండి, సంక్షేమ పథకాలను అయాచితంగా పొందడంతో మొదలు అనేక రకాలుగా పథకాలను దుర్వినియోగం చేస్తుండవచ్చు.

అందుకే ప్రస్తుతానికి వాటిని ఇన్ యాక్టివ్ స్టేటస్ లో  ఉంచారు. అయితే త్వరలోనే కొత్త రేషన్ కార్డులను కూడా జారీ చేయనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు మొత్తం పరిశీలనలు జరిగే అవకాశాలున్నాయి. 
Tags:    

Similar News