ఏటీఎంల ద్వారా విత్ డ్రా చేసుకున్న సమయంలో కొత్త 2000 రూపాయలు వస్తే కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే... స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో పిల్లలు ఆడుకొనే నకిలీ 2000 నోట్లు రావడం సంచలనం సృష్టించింది. దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ లో ఉన్న ఓ ఏటీఎం నుంచి ఈ నోట్లు వచ్చాయి. మొదట చూడగానే ఇవి అసలు నోట్లుగానే కనిపించినా.. అవి పిల్లల నోట్లని చెప్పే గుర్తులు ఎన్నో దీనిపై ఉన్నాయి. ఈ నోటుపై ఆర్బీఐకి బదులుగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, గ్యారెంటీడ్ బై చిల్డ్రన్స్ గవర్న్ మెంట్ అని ఉండటం విశేషం. చూరన్ లేబుల్ అని ఓ పక్క రాసి ఉంది. బ్యాంకు సీల్ కు బదులుగా పీకే లోగో ఉంది.
ఈ వ్యవహారం కలకలం రేకెత్తించిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. మొదట ఓ కస్టమర్‌కు ఇలాంటి నాలుగు నోట్లు వచ్చాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. దీనిపై విచారణ జరపడానికి ఓ ఎస్ఐని పంపించామని, అతను కూడా విత్ డ్రా చేయగా.. అలాంటిదే మరో నోటు వచ్చిందని ఆ అధికారి తెలిపారు. ఏటీఎంలో ఉన్న మిగతా నోట్లను పరిశీలించగా.. అవన్నీ అసలువే ఉన్నాయని చెప్పారు. దక్షిణ ఢిల్లీలోని చత్తార్‌పూర్ కాల్‌సెంటర్లో పనిచేసే రోహిత్ అనే వ్యక్తికి మొదటగా ఈ నకిలీ నోట్లు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఈ నకిలీ నోట్లు ఎవరు ఉంచారన్నదానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. అటు ఎస్‌బీఐ టీమ్ కూడా ఈ ఘటనపై విచారణ జరపడానికి ఓ బృందాన్ని నియమించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/