అవినీతి అధికారి ఫ్యామిలీ మెంబర్స్ కు జైలుశిక్షా?

Update: 2016-06-06 04:28 GMT
తప్పు చేసిన వారికి శిక్ష మామూలే. అయితే.. తప్పు చేస్తున్న విషయాన్ని గుర్తించి కూడా నిలువరించని కుటుంబ సభ్యులను సైతం దోషులుగా చేస్తూ జైలుశిక్ష విధించిన ఘటన ఒకటి చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం జబల్ పూర్ సీబీఐ కోర్టులో చోటు చేసుకుంది. అవినీతి చేసిన అధికారితో పాటు.. ఆ అవినీతిని ఆపని కుటుంబ సభ్యులను కూడా దోషులుగా నిర్ధారించిన కోర్టు వారికి కూడా శిక్షను విధించటం సంచలనంగా మారింది. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఉదంతంలోకి వెళితే..

కేంద్రప్రభుత్వ ఉద్యోగి అయిన సూర్యకాంత్ గౌర్ మీద రూ.94 లక్షల ప్రభుత్వ నిధుల్ని స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం మీద ఆయనపై కేసు నమోదు చేసి జబల్ పూర్ సీబీఐ కోర్టులో కేసు విచారణ జరిపారు. న్యాయమూర్తి యోగేష్ చంద్ర గుప్తా నేతృత్వంలో సాగిన విచారణలోఉద్యోగి సూర్యకాంత్ గౌర్ తో పాటు.. ఆయన సతీమణి వనితా గౌర్.. కుమారుడు శిశిర్ గౌర్.. కోడలు సునీతా గౌర్ లను కూడా దోషులుగా నిర్దారించారు.

2010 జులై 14న సూర్యకాంత్ గౌర్ ఇంటి మీద దాడులు నిర్వహించి.. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిధులను తన ఖాతాలకు తరలించుకున్నట్లుగా పక్కా సాక్ష్యాలు లభించాయి. దీంతో.. సూర్యకాంత్ గౌర్ తో పాటు.. ఆయన కటుంబ సభ్యులందరిని దోషులుగా చేస్తూ 5 ఏళ్ల జైలు శిక్షను విధించారు. ఒక అవినీతి కేసు విషయంలో కుటుంబం మొత్తానికి జైలుశిక్ష విధించటం అరుదైన ఘటనగా చెబుతున్నారు.
Tags:    

Similar News