కిలో ఉల్లిని రైతు ఎంతకు అమ్ముతున్నాడో తెలుసా?

Update: 2016-05-25 04:39 GMT
కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. పండించే రైతుకు వచ్చే ఆదాయం చూస్తే.. ఎంత దారుణ పరిస్థితుల్లో రైతులు ఉన్నారో ఇట్టే తెలుస్తుంది. కిలో ఉల్లిపాయలు బహిరంగ మార్కెట్లో ఎంత పెట్టి కొంటున్నది అందరికి తెలిసిందే. అదే ఉల్లిపాయను రైతు ఎంతకు అమ్ముతున్నారో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

 నెలల తరబడి శ్రమించి.. కష్టపడి పండించిన పంటకు రైతుకు మిగులుతుదన్నది ఎంతో తెలిస్తే సాక్ కు గురి కావాల్సిందే. పండించే రైతుకు ఫలసాయం లేకుండా మధ్యవర్తులు.. వ్యాపారులు ఎంతగా దోచుకుంటున్నారో తాజా లెక్కను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మహారాష్ట్రలో ఈ మధ్యన రైతులు తరచూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నెలల తరబడి కష్టించి పని చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర సంగతి తర్వాత.. వేల రూపాయిలు ఖర్చు చేసి పంటకు చేతికి వస్తున్నది చూసుకొని వారి నోటి వెంట మాట రాని పరిస్థితి.

 తాజాగా ఒక రైతు తాను పండించిన పంటకు.. తనకు వచ్చిన ఆదాయాన్ని లెక్క చెప్పి.. వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా అర్థమయ్యేలా చేశాడు. ఇతగాడి ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. మహారాష్ట్రలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి. వెయ్యి కేజీల ఉల్లిపాయలు అమ్మిన దేవ్ దాస్ పర్భానే అనే 48 ఏళ్ల రైతు చేతిలో మిగిలింది ఎంతన్న లెక్కను అతడి మాటల్లోనే వింటే..

రెండు ఎకరాల్లో ఉల్లిని సాగు చేసిన పర్భానే.. 952 కేజీల ఉల్లిపాయలు చేతికి వచ్చాయి. వాటిని 18 బస్తాల్లో మహారాష్ట్రలోని ఫూణె వ్యవసాయ మార్కెట్ కు తరలించాడు. అక్కడ కేజీకి రూ.1.60 చొప్పున ఉల్లిపాయల్ని కొన్నారు. దీంతో 952 కేజీల ఉల్లి పంటకు పర్భానే చేతికి వచ్చింది అక్షరాల రూ.1523. ఈ మొత్తంలో దళారుల కమీషన్ కింద రూ.92.. కూలీలకు రూ.59.. చిల్లర ఖర్చులకు రూ.51.. ట్రాన్స్ పోర్ట్ కోసం ట్రక్కు డ్రైవర్ కు రూ.1320 చెల్లించాడు. ఉల్లి పంటను అమ్మినందుకు పర్భానే చేతికి రూ.1523 వస్తే.. పండించిన పంటకు అయిన ఖర్చును పెట్టి.. పంటను అమ్మటం కోసం పెట్టిన ఖర్చు రూ.1522 అయ్యింది. అంటే.. 952 కేజీల ఉల్లిపాయలు అమ్మితే రైతు చేతిలో రూపాయి మిగిలిందన్న మాట. ఈ పంటను పండించటం కోసం పర్భానే చేసిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల రూ.80వేలు. ఇంత దారుణ పరిస్థితి ఉంటే.. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటాడా..?

Tags:    

Similar News