కొత్త ట్రెండ్‌: రైతుకు ప‌ద‌వీ విర‌మ‌ణ‌!

Update: 2018-05-30 03:32 GMT
ప్ర‌భుత్వ ఉద్యోగి కావొచ్చు.. ప్రైవేటు ఉద్యోగి కావొచ్చు.. 58 ఏళ్లు పూర్తి అయితే చాలు ఆటోమేటిక్ గా రిటైర్మెంట్ ఇచ్చేస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో మిన‌హాయింపుగా ఎక్స్ టెన్ష‌న్ ఇస్తుంటారు. మ‌రి.. మిగిలిన రంగాల మాటేమిటి?  వ్యాపారంతో పోలిస్తే.. రైతు ప‌రిస్థితి మ‌రింత క‌ష్టంగా ఉంటుంది. పొద్దు పొద్దున్నే పోలానికి వెళ్ల‌టం.. మోటారు వేయ‌టం మొద‌లు.. రాత్రి వ‌ర‌కూ అదే ప‌నిగా ప‌నులు. శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌.

ప్ర‌కృతి క‌రుణిస్తుందా?  లేదా?  తెలీక స‌త‌మ‌త‌మ‌వుతూ ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న‌తో ప‌ని చేసుకోవాల్సిన ప‌రిస్థితి. చిన్న వ‌య‌సు నుంచి ముదిమి మీద ప‌డిన త‌ర్వాత కూడా.. ఒంట్లో స‌త్తువ పూర్తిగా త‌గ్గిపోయేవ‌ర‌కూ రైతు ప‌ని చేస్తూనే ఉండాలి. వారి కుటుంబాల్లోనూ అలాంటి సంస్కృతే ఉంటుంది.

తాజాగా అలాంటి వాటిని బ్రేక్ చేసి సంచ‌ల‌నం సృష్టించిందో కుటుంబం. రైతుగా ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ప‌ని చేస్తున్న త‌మ తండ్రికి వ్య‌వ‌సాయ క‌ష్టం నుంచి రిటైర్మెంట్ ఇస్తూ భారీ వేడుక‌ను నిర్వ‌హించారు. ఈ ఆస‌క్తిక‌ర‌మైన ఉదంతం ఖ‌మ్మం జిల్లా ర‌ఘునాథ‌పాలెం మండ‌లం హ‌ర్యాతండాలో చోటు చేసుకుంది.

హ‌ర్యాతండాకు చెందిన బానోత్ నాగులుకు వంశ‌పారంప‌ర్యంగా ఒక ఎక‌రం వ‌చ్చింది. ఓవైపు పొలంలో ప‌నులు చేసుకుంటూనే మ‌రోవైపు నెల‌లో 15 రోజుల పాటు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి ప‌ని చేసేవాడు. ఇలా ఒక ఎక‌రం పొలాన్ని త‌న రెక్క‌ల క‌ష్టంతో ప‌ది ఎక‌రాలుగా చేశాడు. అంతేకాదు.. త‌న క‌ష్టంతో త‌న ముగ్గురు కొడుకుల్ని ఉన్న‌త చ‌దువులు చ‌దివించాడు.

పెద్ద‌కొడుకు రాందాస్ విజ‌య‌వాడ‌లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ప‌ని చేస్తుంటే.. రెండో కొడుకు ర‌వి హైద‌రాబాద్ లో ఐటీ ఇంజినీర్ గా ప‌ని చేస్తున్నాడు. మూడో కొడుకు శ్రీ‌ను ఏంఏ బీఈడీ చేసి ఉద్యోగ అన్వేష‌న‌లో ఉన్నాడు. కొడుకులు చేతికి రావ‌టం.. ఆర్థికంగా కుటుంబం స్థిర‌ప‌డ‌టంతో 65 ఏళ్ల వ‌య‌సులో ఉన్న త‌మ తండ్రి చేత వ్య‌వ‌సాయ విర‌మ‌ణ చేయించాల‌ని నిర్ణ‌యించారు.

ఇంత‌కాలం త‌మ కోసం క‌ష్ట‌ప‌డిన త‌ల్లిదండ్రుల‌కు ఎలాంటి క‌ష్టం లేకుండా చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా వ్య‌వ‌సాయ విర‌మ‌ణ స‌న్మాన మ‌హోత్స‌వం పేరుతో మంగ‌ళ‌వారం భారీ వేడుక‌ను నిర్వ‌హించారు. బంధుమిత్రులంద‌రి స‌మ‌క్షంలో త‌మ త‌ల్లిదండ్రుల‌కు శాలువాలు క‌ప్పి స‌న్మానం చేశారు.ఇక‌పై వారి బాధ్య‌త అంతా తామే చూస్తామ‌ని చెప్పి.. త‌ల్లిదండ్రుల ఆశీస్సులు పొందారు. వ‌య‌సు మీద ప‌డిన త‌ల్లిదండ్రుల గురించి ఇంత‌లా ఆలోచించే కొడుకులు నిజంగా స్ఫూర్తిదాత‌లు క‌దూ!


Tags:    

Similar News