చంద్రుళ్లకు సురుకు పుట్టేలా కుర్రాడి ప‌రుగు

Update: 2018-04-13 04:52 GMT
పైకి చెప్ప‌టం లేదు కానీ ఇద్ద‌రు చంద్రుళ్ల సర్కార్లు అనుస‌రిస్తున్న రైతు విధానాల‌పై ఓ రైతుబిడ్డ ప‌రుగు తీయాల‌ని డిసైడ్ అయ్యాడు. అది నిర‌స‌న ప‌రుగు అనుకోవ‌చ్చు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల‌కు చురుకు పుట్టించేలా ప‌రుగు అనుకోవ‌చ్చు.. ఏదైనా అనుకోవ‌చ్చు. ఎందుకంటే.. ఆ కుర్రాడికి రాజ‌కీయం తెలీదు. తెలిసింద‌ల్లా ల‌క్ష‌లాది మంది రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ను తెర మీద‌కు తీసుకురావాల‌ని త‌పిస్తున్నాడు. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కు తెర తీయ‌టం ద్వారా ప్ర‌భుత్వాల్లో క‌ద‌లిక కోసం చేస్తున్న ప్ర‌య‌త్నం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఇంత‌కీ ఆ రైతుబిడ్డ ఎవ‌రో కాదు.. కృష్ణా జిల్లా అప్పిక‌ట్ల‌కు చెందిన ఫ‌ణీంద్ర‌. గుడివాడ‌లో బీటెక్ కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివి హైద‌రాబాద్ ఆర్ ఆర్ బీ ఇంజ‌నీరింగ్ టెక్నాల‌జీస్ సంస్థ‌లో అడ్మినిస్ట్రేట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నాడు. ఇంత‌కీ ఇత‌ను ఎందుకు ప‌రుగు తీయాల‌నుకుంటున్నాడంటే.. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ ప‌రుగుకు శ్రీ‌కారం చుట్ట‌నున్నాడు. ఈ నెల 14న (శ‌నివారం) హైద‌రాబాద్ అసెంబ్లీ నుంచి ప‌రుగు మొద‌లెట్ట‌నున్నాడు.

హైద‌రాబాద్ అసెంబ్లీ ఎదుట మొద‌ల‌య్యే అత‌డి ప‌రుగు అమ‌రావ‌తిలోని స‌చివాల‌యం వ‌ర‌కు ఈ ప‌రుగు సాగ‌నుంది. త‌న ప‌రుగు ల‌క్ష్యం కౌలురైతుకు గిట్టుబాటు ధ‌ర ద‌క్కేలా చేయ‌టమ‌ని చెబుతున్నారు. పంట‌లు బాగా పండిన‌ప్పుడు ధ‌ర‌లు త‌గ్గిపోతున్నాయ‌ని.. పంట‌లు బాగా పండ‌న‌ప్పుడు ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని.. దీంతో రైతులు ఆర్థికంగా చితికిపోయి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాలు రైతులు..కౌలురైతుల‌కు అండ‌గా నిలిచేలా.. వారు పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌లిగించాల‌ని కోరుతున్నాడు. త‌న‌కు ఎలాంటి రాజ‌కీయ ఉద్దేశాలు లేవ‌ని.. త‌న ప‌రుగు కేవ‌లం రెండు ప్ర‌భుత్వాల్లో క‌ద‌లిక తేవ‌టం కోస‌మేన‌ని చెబుతున్నాడు. రోజుకు 60 నుంచి 80 కిలోమీట‌ర్లు ప‌రుగు పెట్టాల‌ని అత‌ను ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

రోజుకు అన్నేసి కిలోమీట‌ర్లు సాధ్య‌మేనా? అంటే.. పొలంలో ప‌ని చేసినోడ్ని.. ప‌రుగు మీద ప్ర‌త్యేక అభిరుచి ఉంది.. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప‌రీక్షించుకున్నాన‌ని..చెప్పిన‌ట్లే చేస్తాన‌ని తాను అనుకుంటున్న‌ట్లుగా చెబుతున్నాడు. అన్నం పెట్టే అన్న‌దాత క‌ష్టం మీద ఒక రైతుబిడ్డ చేస్తున్న ప్ర‌య‌త్నానికి అంద‌రూ మ‌ద్ద‌తును ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక సామాన్యుడి ప‌రుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చంద్రుళ్లుకు సురుకు పుట్టాల‌ని కోరుకుందాం. అలా అయినా.. అన్న‌దాత‌ల స‌మ‌స్య‌లు ఎంతోకొంత ప‌రిష్కార‌మ‌య్యే దిశ‌గా అడుగులు ప‌డ‌తాయ‌ని ఆశిద్దాం.
Tags:    

Similar News