అన్నదాత ఆగ్రహంతో అక్కడ ఎన్నిక తడిచి మోపెడు

Update: 2019-04-08 04:50 GMT
అన్నం పెట్టే అన్నదాతకు ఆగ్రహం కలిగితే?  అయ్యా.. బాబ్బాబు.. మీకు పుణ్యం ఉంటుంది.. మా సమస్యల్ని పట్టించుకోడంటూ వేడుకునే రైతును చులకనగా చూసే రాజకీయాలకు.. వ్యవస్థకు దిమ్మ తిరిగేలా షాకిస్తున్నారు నిజామాబాద్ రైతులు. ఇప్పటివరకూ అన్నదాత కడుపు మండితే ఎంత దారుణ పరిస్థితులు చోటు చేసుకుంటాయో చెప్పే సినిమాలు వచ్చాయి.

రీల్ కంటే రియల్ గా రైతుకు కాలిపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని నిజామాబాద్ రైతులు తమ చేతల్లో చూపిస్తున్నారు. పసుపు.. ఎర్రజొన్న రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం చేయని ప్రయత్నం లేదు. ధర్నాలు.. రాస్తారోకోలు.. నిరసనలు చేసినా పట్టించుకోని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై మంట పుట్టిన అన్నదాతలు సంఘటితంగా మారి ఊహించని రీతిలో నిర్ణయాన్ని తీసుకున్నారు.

తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో రైతులు పోటీ చేయటం.. అది కూడా భారీగా నామినేషన్లు వేయటంతో కేంద్ర ఎన్నికల సంఘం మొదలు.. అధికారుల వరకూ చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి.  మొత్తంగా 185 మంది బరిలో నిలిచిన నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘానికి కత్తి మీద సాముగా మారింది. ఇంత భారీగా అభ్యర్థులు ఎన్నికల్లోపోటీ చేస్తుండటంతో.. అందుకు తగ్గ ఏర్పాట్ల కోసం కిందా మీదా పడుతున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల కోసం హెలికాఫ్టర్ ను వినియోగిస్తున్న ఎన్నికల అధికారులు.. తాజాగా ఈ ఎన్నికల నిర్వహణ ఖర్చు ఎంత భారీగా ఉంటుందన్న విషయాన్నిప్రస్తావించారు.

సాధారణంగా లోక్ సభ ఎన్నికలను నిర్వహించటం కోసం సగటున ఒక్కో సెగ్మంట్ కు రూ.3 కోట్ల వరకు ఖర్చు వస్తుంటుంది. అందుకు భిన్నంగా నిజామాబాద్ ఎన్నికలకు ఒక్కో సగ్మెంట్ కు రూ.5 కోట్ల వరకూ ఖర్చు రానున్నట్లు చెబుతున్నారు.  రికార్డు స్థాయిలో బరిలో ఉన్న అభ్యర్థులతో ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసిన ఈ ఎన్నిక.. నిర్వహణ ఖర్చు విషయంలోనూ సరికొత్త రికార్డును  సృష్టిస్తోంది. ఒక అంచనా ప్రకారం నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక కోసం ఏకంగా రూ.35 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం ఉందంటున్నారు. చివర్లో మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది.

ఈ ఎన్నిక కోసం సిబ్బంది వినియోగం కూడా భారీగా ఉంటుందని చెబుతున్నారు. 1788 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో వీవీ ఫ్యాట్.. ఒక్కో కంట్రోలింగ్ యూనిట్ తో పాటు 12 చొప్పున మొత్తం పాతికవేల వరకూ ఈవీఎంలను వినియోగిస్తున్నారు. సాధారణంగా ఒక పోలింగ్ కేంద్రంలో నలుగురు సిబ్బందిని వినియోగిస్తుంటారు. కానీ.. నిజామాబాద్ లో మాత్రం మరో ఇద్దరిని అదనంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం జరుగుతున్న ఎన్నిక కోసం ఏకంగా 9వేల మంది సిబ్బందిని వినియోగిస్తుండటం గమనార్హం. ఇప్పుడు అర్థమైందా రైతు కన్నెర్ర చేస్తే ఏమవుతుందో?


Tags:    

Similar News