రాజధాని రచ్చ ... ప్రధానికి రాజధాని రైతుల లేఖలు !

Update: 2019-12-24 11:50 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన మూడు రాజధానుల అంశం పై రాష్ట్రంలో   భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు అయితే సీఎం నిర్ణయంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమ నిరసనలు తెలుపుతున్నారు. రాజధాని ప్రాంతం చుట్టుప్రక్కల 29 గ్రామాల్లోని రైతులు రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం భారీగా పోలీసుల్ని మోహరించాయి. రాజధాని రైతులు ఏడో రోజు ఈ ఆందోళనలని  మరింత ఉధృతం చేశారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో నిరసనలకు దిగుతున్నారు. వీరికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.

ఈ నేపథ్యంలోనే  తాజాగా అమరావతి రైతులు క్యాపిటల్  విషయంలో ప్రధాని మోదీకి లేఖలు రాశారు. రాజధాని విషయంలో తమకు జరిగిన అన్యాయంపై 3పేజీల లేఖ రాశారు. అంతేకాదు తమ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను కూడా లేఖకు జోడించి రాజధాని రైతులు మోదీకి పంపించారు. ఏపీకి మూడు రాజధానులు నిర్ణయం పై ప్రధాని జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పెద్ద సంఖ్యలో లేఖలను ప్రధాని కార్యాలయానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు రాజధాని రైతులు.

ఇకపోతే రాజధాని విషయంలో రాష్ట్ర బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి నేతలు వికేంద్రీకరణకు వ్యతిరేకిస్తుండగా.. ఎంపీ జీవీఎల్ మూడు రాజధానులు అన్న విషయాన్ని స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలందరూ రాజధాని పై ఒకే మాట మీదకి రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ స్థాయి పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News