పసుపు రైతుల‌కు బాండ్ పేప‌ర్ రాసిచ్చాడు!

Update: 2019-05-25 09:05 GMT
సినిమాల్లో ఇట్టే సాధ‌మయ్యే విష‌యాలు వాస్త‌వంలో అంత సులువు కాదు. అయినా.. సంక‌ల్పం ఉంటే అదేమీ పెద్ద విష‌యం కాద‌న్న వైనం తాజాగా నిజామాబాద్ ప‌సుపురైతుల ఎపిసోడ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప‌సుపు బోర్డుతో పాటు.. రైతుల స‌మ‌స్య‌ల్ని తీర్చే విష‌యంలో ఎంపీ క‌విత విఫ‌లం కావ‌టం.. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రైతులు తాజా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏకంగా 185 మంది అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగ‌టం తెలిసిందే.

దీంతో ఈ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిలో ప‌డేలా చేసింది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె బ‌రిలో ఉన్న నిజామాబాద్ ఎంపీస్థానంలో ప‌సుపురైతుల పోరాటం అంద‌రి దృష్టిలో ప‌డింది. త‌మ స‌మ‌స్య‌ల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన క‌విత‌కు బుద్ధి చెప్పే ప‌నిలో భాగంగా బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన  ధ‌ర్మ‌పురి అర‌వింద్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌టంతో ఆయ‌న సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు.

విజయం అనంత‌రం ప‌సుపురైతుల స‌మ‌స్య‌ల్ని తాను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పిన అర‌వింద్ వారికి బాండ్ పేప‌ర్ రాసిచ్చారు. ఒక‌వేళ తాను కానీ ప‌సుపురైతుల స‌మ‌స్య‌ల్ని తీర్చ‌కుంటే త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న మాటిస్తూ బాండ్ పేప‌ర్ రాసివ్వ‌టం విశేషం.  ప‌సుపు రైతులు పుణ్య‌మా అని రికార్డు స్థాయిలో అభ్య‌ర్థులు బ‌రిలో నిల‌వ‌టంతో ఎన్నిక‌ల సంఘం భారీ ఈవీఎంల‌ను ఈ ఎన్నిక కోసం వినియోగించింది. దేశం మొత్తమ్మీదా ఈ స్థాయిలో అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం మ‌రేదీ లేక‌పోవటం గ‌మ‌నార్హం.

    

Tags:    

Similar News