రైతుల నిరసనలు ఈ రోజుతో ముగుస్తాయి ... కేంద్రమంత్రి సోమ్ ప్రకాశ్

Update: 2020-12-30 09:15 GMT
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో పార్లమెంటు మూడు వ్యవసాయ చట్టాలను ఆమోదించింది. వాటిని రద్దు చేయాలని రైతులు ఆందోళనకి దిగారు. కేంద్రం ఆ చట్టాల్లో సవరణలు చేస్తామని చెప్తున్నా కూడా , మొత్తం రద్దు చేసే వరకు ఆందోళనలు ఆపే ప్రసక్తే లేదు అంటూ రైతులు తేల్చి చెప్పారు.

ఇదిలా ఉంటే , ఇప్పటికే పలు ధపాలుగా రైతులు కేంద్రం తో చర్చలు జరిపారు. కానీ, ఆ చర్చలు ఫలించలేదు. ఇక తాజాగా నేడు దాదాపు 40 రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి చర్చలు జరపబోతుంది. కేంద్ర ప్రభుత్వం తరపున పాల్గొంటున్న ప్రతినిధి బృందంలో సోమ్ ప్రకాశ్‌ తోపాటు, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయల్ ఉన్నారు. దీనితో రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు నేటితో తెర పడుతుందని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ చెప్పారు. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిపే చర్చలు సత్ఫలితాలు ఇస్తాయనే ఆశాభావాన్ని అయన వ్యక్తం చేశారు.

నిరసనలకు ప్రధాన కారణమైన కనీస మద్దతు ధర అంశంతో సహా అన్ని విషయాలపైనా చర్చ జరుగుతుందని అయన తెలిపారు. విశాల దృక్పథంతో చర్చలు జరుగుతాయని, రైతుల నిరసనలు ఈ రోజుతో ముగుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదిలావుండగా, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జాయింట్ సెక్రటరీ సుఖ్వీందర్ సింగ్ సబ్రా మాట్లాడుతూ, నేటి చర్చల ద్వారా ఎటువంటి పరిష్కారం లభించబోదని చెప్పారు.
Tags:    

Similar News