అంత పైత్యమా?: జైశ్రీరాం అన్నందుకు సారీ!

Update: 2017-07-31 09:43 GMT
అస‌లేం జ‌రిగిందో చెప్పే ముందు ఓ చిన్న ఉదాహ‌ర‌ణ చెప్పాలి. అప్పుడు విష‌యం అర్థం కావ‌టంతోపాటు.. సారీ చెప్ప‌టం ఎందుకు  త‌ప్ప‌న్న‌ది మ‌రింత బాగా అర్థ‌మ‌వుతుంది. ఎందుకిలా అంటే.. కొంద‌రు అతివాదులు చేసే ప‌నికి దేశంలోని ప్ర‌జ‌ల మీద ప్ర‌భావం ప‌డ‌ట‌మే కాదు.. దీర్ఘ కాలంలో కొత్త కొత్త స‌మ‌స్య‌లు తెర మీద‌కు వ‌స్తాయి. కొన్ని ద‌శాబ్దాల పాటు కొన్ని విష‌యాల గురించి ఓపెన్ గా మాట్లాడ‌కూడ‌దంటూ ఓటుబ్యాంకు రాజ‌కీయాలు చేసిన పార్టీల పుణ్య‌మా అని.. ఈ దేశంలో కొంద‌రు చేసే విప‌రీత చేష్ట‌ల్ని ప్ర‌శ్నించే వారే లేని ప‌రిస్థితి. ఇప్పుడు కూడా అదే తీరులో ఉంటే.. దేశంలో లేనిపోని ఉద్రిక్త‌లు పెరిగి.. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ధ్య దూరం పెరిగే ప్ర‌మాదం ఉంది. అందుకే.. త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పు ప‌ట్టాల్సిందే. వారి తీరును ఖండించాల్సిందే.

ఇక‌.. ఉదాహ‌ర‌ణ‌లోకి వెళ‌దాం. ఎవ‌రైనా హిందూ మ‌తానికి చెందిన పెద్ద మ‌నిషి.. ముస్లిం మ‌తానికి సంబంధించిన ఏదైనా నినాదాన్ని చేశార‌నుకుందా? అప్పుడేం జ‌రుగుతుంది? మ‌త సామ‌ర‌స్యానికి ఎంత‌గా కృషి చేస్తున్నాడో అని ప్ర‌శంసిస్తారు. అలాంటి వేళ‌లో.. ఎవ‌రైనా హిందూ మ‌తానికి చెందిన స్వాములోరు కానీ మ‌రింక ఎవ‌రైనా స‌రే.. అలాంటి ప‌ని చేస్తావా? అంటూ త‌ప్పు ప‌డుతూ వ్యాఖ్య చేస్తే ఏం చేస్తారు? నీకేమైనా పోయే కాలం వ‌చ్చిందా? మ‌రీ.. అంత మ‌త మౌఢ్యం ఎందుకు? అంటూ తిట్టిపోయ‌టం గ్యారెంటి. ఇక‌.. అస‌లు విష‌యంలోకి వ‌చ్చేద్దాం.

ఈ మ‌ధ్య‌న బీహార్ పొలిటిక‌ల్ సీన్ గంట‌ల వ్య‌వ‌ధిలో ఎలా మారిపోయిందో అంద‌రికి తెలిసిందే. రాత్రికి రాజీనామా చేసిన ముఖ్య‌మంత్రి.. ప‌క్క‌రోజు ఉద‌యానికి మ‌ళ్లీ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టం.. మ‌ళ్లీ కొత్త టీం వ‌చ్చేయ‌టం తెలిసిందే. అలా కొత్త మంత్రివ‌ర్గంలో మంత్రిగా బాధ్య‌త‌లుస్వీక‌రించారు జేడీయూకు చెందిన ముస్లిం నేత ఖుర్షీద్ అహ్మ‌ద్‌. అనంత‌రం అసెంబ్లీలో నితీశ్ స‌ర్కారు బ‌లం చూపించుకొని అసెంబ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఖుర్షీద్ హిందువుల‌కు మ‌ద్ద‌తుగా జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారు.

నేను రాముడ్ని..ర‌హీమ్‌ ను ఇద్ద‌రినీ పూజిస్తాను. బీహార్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుందంటే.. జైశ్రీరాం అని నిన‌దించ‌టానికి ఏ మాత్రం సంకోచించ‌న‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న చేతికి క‌ట్టుకున్న కంక‌ణాల‌ను చూపించారు. నితీశ్ క్యాబినెట్ లో మైనార్టీ శాఖ‌ను నిర్వ‌హిస్తున్న స‌ద‌రు మంత్రి వ్యాఖ్య‌ల‌పై తీవ్ర‌స్థాయిలో క‌ల‌క‌లం రేగింది. ఖుర్షీద్ చ‌ర్య‌ల‌పై కొంద‌రు ముస్లిం పెద్ద‌లు ఫైర్ అయ్యారు. ఆయ‌న్ను వెంట‌నే ఇస్లాం నుంచి బ‌హిష్క‌రిస్తూ ఫ‌త్వా జారీ చేశారు.

దీంతో.. మంత్రిగారికి ఒక్క‌సారి షాక్ తిన్నారు. త‌న మాట‌లకు తాను ప్రాతినిధ్యం వ‌హించే వ‌ర్గం నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న విష‌యాన్ని గుర్తించారు. ఆ వెంట‌నే.. రంగంలోకి దిగి సారీ చెప్పి.. త‌న వ్యాఖ్య‌లు ఎవ‌రినైనా నొప్పించి ఉంటే సారీ చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఒక మ‌తానికి చెందిన నేత మ‌రో మ‌తానికి అనుకూలంగా నినాదాలు చేస్తే.. ఇంత‌లా ఖండించి.. హ‌డావుడి చేయ‌టం స‌రైన ప‌ద్ధ‌తా?  దీనిపై ప్ర‌జాస్వామ్య వాదులు.. లౌకిక‌వాదులు ఎందుకు నోరు విప్ప‌రు? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌.
Tags:    

Similar News