ఎఫ్‌ బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్‌ లో 'మ‌నోడు'

Update: 2017-04-19 14:33 GMT
స్వ‌శ‌క్తితో.. మేధోత‌నంతో వార్త‌ల్లోకి ఎక్కిన ఎన్ ఆర్ ఐల‌ను చాలామందినే చూసి ఉంటాం. కానీ.. తాజా ఉదంతం అందుకు భిన్నం. ఒక ప్ర‌వాస భార‌తీయుడు అమెరికా మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్‌ గా మార‌ట‌మే కాదు.. అత‌గాడి ఆచూకీ చెప్పినోళ్ల‌కు రూ.64.54ల‌క్ష‌లు ఇస్తామంటూ న‌జ‌రానా ప్ర‌క‌టించింది. ఇంత‌కీ ఆ భార‌తీయ యువ‌కుడు ఎవ‌రు? అత‌డు చేసిన దారుణ నేరం ఏమిటి? అత‌గాడి ఆచూకీకి అంత ధ‌రను అమెరికా పోలీసు అధికారులు ఎందుకు పెట్టార‌న్న విష‌యాల్లోకి వెళితే..

26 ఏళ్ల భ‌ద్రేష్ కుమార్ చేత‌న్ భాయ్ ప‌టేల్ గుజ‌రాతీ. అత‌నికి పాల‌క్ తో వివాహ‌మైంది. ఇరువురు మేరీలాండ్‌ లోని డంకెన్ డోన‌ట్స్ లో ప‌ని చేస్తుంటారు. వీరిద్ద‌రి మ‌ధ్య అప్పుడ‌ప్పుడు గొడ‌వ‌లు చోటు చేసుకునేవి. భార‌త్‌ కు వెళ్లిపోదామ‌ని భ‌ద్రేష్‌ ను కోరేది. అందుకు అత‌ను నిరాక‌రించేవాడు. ఈ విష‌యంపై వారిద్ద‌రి మ‌ధ్య‌న మ‌న‌స్ప‌ర్థ‌లు ఉండేవి.

ఇదిలా ఉండ‌గా.. 2015 ఏప్రిల్ 12న రెస్టారెంట్‌ లో ప‌ని చేయ‌టానికి వీరిద్ద‌రూ వ‌చ్చారు. కిచెన్‌ లోకి వెళ్లిన కాసేప‌టికే భార్య పాల‌క్‌ ను అత్యంత దారుణంగా.. కిరాత‌కంగా హ‌త‌మార్చాడు భ‌ద్రేష్‌. ప‌దునైన క‌త్తితో ప‌లుమార్లు ఆమెను పొడిచేయ‌టంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించింది. ఆ వెంట‌నే అత‌ను ప‌రార‌య్యాడు. అప్ప‌టి నుంచి అత‌డి ఆచూకీ కోసం ఫెడ‌ర‌ల్ పోలీసులు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. కానీ.. అత‌గాడి ఆచూకీ మాత్రం ల‌భించింది లేదు.

ఈ నేప‌థ్యంలో అమెరికా అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ అయిన ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్స్ జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో భ‌ద్రేష్ కుమార్ చేత‌న్ భాయ్ ప‌టేల్ ఉండ‌టం గ‌మ‌నార్హం. హ‌త్య చేసిన రోజు అత‌డు న్యూజెర్సీలోనే ఉన్న‌ట్లుగా తాము గుర్తించిన‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు. అనంత‌రం అత‌డుప‌రార‌య్యాడ‌ని.. దేశం విడిచి వెళ్లే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. అత‌డు ఎక్క‌డికి వెళ్లింద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అత‌డి వీసా గ‌డువు ముగిసింద‌ని.. అయినా దేశంలోనే ఉన్న‌ట్లుగా అమెరికా పోలీసులు భావిస్తున్నారు. అత‌డ్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప‌ట్టుకుంటామ‌ని.. విడిచి పెట్టేది లేద‌ని చెబుతున్నారు. తాజాగా అత‌డి ఫోటోను విడుద‌ల చేసిన పోలీసులు.. ప్ర‌జ‌లు స‌హ‌క‌రిస్తే.. అత‌డ్ని అదుపులోకి తీసుకోవ‌టం ఖాయ‌మంటున్నారు. అత‌ను లాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన నేర‌స్తుల్ని ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప‌ట్టుకొని తీరుతామ‌ని.. చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠిన శిక్ష ప‌డేలా చేస్తామ‌ని పోలీసులు చెబుతున్నారు. ఎఫ్‌ బీఐ డేగ‌క‌న్ను నుంచి త‌ప్పించుకొని తిరుగుతున్న భ‌ద్రేష్ కుమార్ ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News