ఫ‌స్ట్ టైమ్‌.. ఈ దేశం భ‌య‌ప‌డుతూ.. జ‌రుపుకొంటున్న స్వ‌తంత్ర దినోత్స‌వం

Update: 2021-08-14 13:52 GMT
స్వ‌తంత్ర భార‌త దేశ చ‌రిత్ర‌కు 75 వ‌సంతాలు పూర్త‌య్యాయి. మ‌న‌దైన పాల‌నతో దేశాన్ని ముందుకు న‌డిపిస్తున్న చ‌రిత్ర‌కు 75 సంవ‌త్సరాలు నిండాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన స్వ‌తంత్ర దినోత్స‌వాల‌కు.. ఇప్పుడు జ‌రుగుతున్న స్వతంత్ర దినోత్స వానికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం క‌ళ్ల‌కు క‌నిపిస్తోంది. `ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం` అనే ప్ర‌శ్న గ‌తంలో ఎప్పుడూ వినిపించ‌లేదు. కానీ, నేడు.. ప్ర‌తి భార‌తీయుడు.. 75 ఏళ్లు పూర్త‌యిన భార‌తంలో ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం? అనే ప్ర‌శ్న‌ను సంధిస్తున్నాడు. మ‌రీ ముఖ్యంగా బీజేపీ రెండో ద‌ఫా పాల‌న‌పై అన్ని వ‌ర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అత్యంత ఘ‌నంగా నిర్వ‌హించాల్సిన 75వ స్వాతంత్య్ర వేడుకులు.. భ‌యం భ‌యంగా బిక్కు బిక్కు మంటూ జ‌రుపుకొనే దుర్గ‌తి దాపురించ‌డం గ‌మ‌నార్హం.

ఒక‌ప్పుడు.. స్వాతంత్య్ర దినోత్స‌వం అంటే.. ఒక వేడుక‌. దేశం యావ‌త్తు.. సంతోషంగా చేసుకునే జాతీయ పండుగ‌. కానీ, నేడు.. ఎటు  చూసినా.. నిర్లిప్త‌త‌.. పాల‌కుల వ్య‌వ‌హారశైలితో విసిగెత్తిన ప్ర‌జ‌ల్లో నిర్వేదం పొట‌మరిస్తున్నాయి. దీంతో ఇప్పుడు స్వాతంత్ర్య భార‌త ప‌ర్వ‌దినం.. భారీ బందోబ‌స్తు న‌డుమ‌.. అడుగ‌డుగునా.. పోలీసు ప‌హారా న‌డుమ నిర్వ‌హించాల్సి రావ‌డం.. నిజంగా.. ఈ ద‌ఫా చోటు చేసుకున్న ప్ర‌ధాన విపత్క‌ర ప‌రిణామంగానే చెప్పాలి. నిజానికి స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక అంటే... వీటిని భ‌గ్నం చేసేందుకు దేశేత‌ర శ‌క్తులు.. ముఖ్యంగా.. శ‌త్రుదేశాలు.. ప్ర‌య‌త్నిస్తాయ‌నే ఆవేద‌న‌, ఆందోళ‌న ఉండేది. దీంతో ప్ర‌ధాన వేడుక‌లు జ‌రిగే ఢిల్లీలో.. భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది.

అంతేకాదు.. ఉగ్ర‌దాడులకు ఇటీవ‌ల ప‌రిణామాలు ఆల‌వాలంగా మారుతుండ‌డంతో.. ఎటు నుంచి ఉగ్ర‌దాడి జ‌రుగుతుందో.. అనే భ‌యంతో.. ప్ర‌భుత్వం భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. కానీ.. 75వ స్వ‌తంత్ర దినోత్స‌వం.. విష‌యానికి వ‌స్తే.. ఈ విష‌యం.. తారుమారైంది. బ‌య‌టి శ‌క్తుల వ్య‌తిరేక‌త‌ను ప‌క్క‌న పెడితే.. అంత‌ర్గ‌త శ‌త్రుత్వం పాల‌కుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పాల‌కుల మితిమీరిన కార్పొరేటీక‌ర‌ణ‌.. రైతులకు అన‌నుకూలంగా ఉన్న చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చి నెత్తిన రుద్దడం.. నిరుద్యోగం ప్ర‌బ‌లుతున్నా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం.. వంటి ప‌రిణామాల‌తో బాహ్య శ‌క్తుల  క‌న్నా కూడా.. ఈ వేడుక‌ల‌ను భ‌గ్నం చేసేందుకు అంత‌ర్గ‌త శ‌క్తులే ప్ర‌య‌త్నిస్తున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మునుపెన్న‌డూ లేని విధంగా ఎర్రకోట వద్ద ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. షార్ప్ షూటర్లు, స్నైపర్లను రంగంలోకి దించారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను నెలకొల్పారు. ప్రధానమంత్రి ప్రసంగించే ఎర్రకోట వద్ద బహుళ స్థాయి రక్షణ వ్యవస్థను సిద్ధం చేశారు. ఎన్ఎస్జీ స్నైపర్లు, ఎలైట్ స్వాట్ కమాండోలు, శునకాలను రంగంలోకి దించారు. ఎర్రకోట పరిసరాల్లో ఉన్న ఆకాశహర్మ్యాలపై షార్ప్ షూటర్లను మోహరించారు. జమ్ము విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో ఎర్రకోట వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఇన్స్టాల్ చేశారు. మొత్తంగా.. ఎర్రకోట వద్ద ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

350 కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని రెండు కంట్రోల్ రూంలలోని పోలీసులు అనుక్షణం పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. 70 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు. ఇవ‌న్నీ.. ఉగ్ర‌దాడుల భ‌యంతో కాదు.. పాల‌కుల విధానాల‌పై మండిప‌డుతున్న సాధార‌ణ ప్ర‌జ‌ల ఆగ్ర‌హం నుంచి త‌ప్పించుకోడానికే.. అనే విష‌యం ఇక్క‌డ ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. 75వ స్వ‌తంత్ర వేడుక‌లు జ‌రుపుకొంటున్న తీరు!!
Tags:    

Similar News