గెలిచినా.. ఓట‌మి భ‌యం.. కాంగ్రెస్‌కు 'ఇదేం ఖ‌ర్మ‌'

Update: 2022-12-09 03:59 GMT
కీల‌క‌మైన గుజ‌రాత్ రాష్ట్రంలో చావు దెబ్బ‌లు తిన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్ప‌టికీ బుద్ధి రాలేదా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో 77 స్థానాల నుంచి ఇప్పుడు 20కి ప‌డిపోయిన పార్టీ.. ముక్కీ మూలిగీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అధికారం ద‌క్కించుకుంది. అయితే, ఇక్క‌డైనా స‌రిగా ఉందా? అంటే.. లేనే లేదు. అధికారం ద‌క్కించుకున్నామ‌న్న ఆనందం కంటే.. బీజేపీ వ్యూహానికి నాయ‌కులు ఎక్క‌డ చిక్కుతారో అనే ఆవేద‌న పార్టీ క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది.

దీనికి కార‌ణం పార్టీ అధిష్టానంపై కొంద‌రు నేత‌లు ఇప్ప‌టికీ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డ‌మే. అంతేకాదు.. అవ‌కాశం చిక్కితే.. బీజేపీ గూటికి వెళ్లిపోయేందుకు నాయ‌కులు సిద్ధ‌ప‌డ‌డ‌మే. ముఖ్యంగా సీఎంను నిర్ణ‌యించ‌డం.. కాంగ్రెస్‌కు చాలా త‌ల‌నొప్పిగా మారింది.   సీఎం రేసులో అనేక మంది నేతలు ఉండ‌డం పార్టీ అధిష్టానానికి మింగుడు ప‌డ‌డం లేదు.

ఎవ‌రిని కాదంటే.. ఏం జ‌రుగుతుందో అనే భ‌యం అధిష్టానానికే ప‌ట్టుకుందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. హిమాచల్‌ ప్రదేశ్ మొత్తం 68 స్థానాలకుగానూ 40 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. అంటే.. మెజారిటీ ఫిగ‌ర్‌కు 5 స్థానాలు మాత్ర‌మే ఎక్కువ‌. గోవా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు ఇక్క‌డ బీజేపీ చ‌క్రం తిప్పితే.. సీఎం అభ్య‌ర్థులుగా ఉన్నామ‌ని చెప్పుకొనేవారు జంప్ అయిపోతే.. వ‌చ్చిన అవ‌కాశం కూడా చేజారిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ముఖ్యమంత్రి పదవిని అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అయితే  ఐదుగురి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తోంది. వీరిలో ప్రతిభా సింగ్, సుఖ్వీందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి, ఠాకూర్ కౌల్ సింగ్, ఆశా కుమారి ఉన్నారు.

కానీ, వీరికి ఇవ్వ‌డాన్ని మెజారిటీ ఎమ్మెల్యేలు త‌ప్పుబ‌డుతున్నారు. వీరిపై అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఒక ఎమ్మెల్యేతో బీజేపీ నేత‌లు ట‌చ్‌లోకి వ‌చ్చేశార‌ని పుకార్లు తెర‌మీదికి వ‌చ్చాయి. మొత్తంగా చూస్తే.. హిమాచ‌ల్‌లో గెలిచినా.. పార్టీలో ఉన్న విచ్చ‌ల‌విడి స్వ‌తంత్రం.. చేటుతెస్తోంద‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News