అమిత్‌ షా దూకుడుకు..అమెరికా అదిరిపోయే షాక్‌ ?

Update: 2019-12-10 12:32 GMT
వివాదాస్పద ‘పౌరసత్వ సవరణ బిల్లు’ను త‌న‌దైన శైలిలో గ‌ట్టెక్కించిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా దూకుడుకు అమెరికా వేదిక‌గా బ్రేకులు ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ బిల్లును లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్‌ - ఆఫ్ఘనిస్థాన్‌ - బంగ్లాదేశ్‌ లో మతపరమైన దాడులకు గురై భారత్‌ కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులను ఆదుకునేందుకే ఈ బిల్లును రూపొందించామని స్పష్టంచేశారు. అయితే, అమెరికాకు చెందిన క‌మిష‌న్ ఆన్ ఇంట‌ర్నేష‌న‌ల్ రిలీజియ‌స్ ఫ్రీడ‌మ్.. వివాదాస్ప‌ద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుపై స్పందించింది. బిల్లును లోక్‌ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆంక్ష‌లు విధించే ఆలోచ‌న‌లో అమెరికా క‌మిష‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ బిల్లు త‌ప్పుడు దిశ‌లో వెళ్తున్న ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపుగా అభివ‌ర్ణించిన క‌మిష‌న్‌...త్వ‌ర‌లో త‌న నిర్ణ‌యం వెలువ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఏడు గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి 12 గంటలకు నిర్వహించిన ఓటింగ్‌ లో బిల్లుకు అనుకూలంగా 311 మంది - వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. దీంతో బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. కాగా, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు కేవ‌లం మ‌తం ఆధారంగా శ‌ర‌ణార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించేదిగా ఉన్న‌ట్లు అమెరికా క‌మిష‌న్ అభిప్రాయ‌ప‌డింది. లోక్‌ స‌భ‌లో బిల్లు పాస్ కావ‌డం ప‌ట్ల యూఎస్‌సీఐఆర్ఎఫ్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. శ‌ర‌ణార్థుల్లో ముస్లింలు కాని వారికి భరోసా ఇవ్వ‌డం స‌రిగా లేద‌ని యూఎస్‌ సీఐఆర్ ఎఫ్ ఆరోపించింది.  ఒక‌వేళ ఉభ‌య‌స‌భ‌ల్లో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు పాసైతే - అప్పుడు హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇత‌ర ప్ర‌ధాన నేత‌ల‌పై ఆంక్ష‌లు విధించాల‌ని అమెరికా క‌మిష‌న్ సూచించింది. మ‌తం ఆధారంగా పౌర‌స‌త్వం క‌ల్పించిన‌ట్లుగా బిల్లు ఉంద‌నే పేరుతో ఈ ముఖ్య నేత‌ల‌పై అమెరికా ఆంక్ష‌ల ఆలోచ‌న ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇదిలాఉండ‌గా, ఈశాన్య రాష్ట్రాల్లో నిర‌స‌న‌లు హోరెత్తాయి.  పౌరసత్వ బిల్లును వ్యతిరేకించడంతోపాటు ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పించాలని ఆల్‌ మోరన్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏఎంఎస్‌ యూ) చేపట్టిన 48 గంటల బంద్‌తో సోమవారం అసోంలో జనజీవనం స్తంభించింది. ఉదయం 5 గంటలకే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. టైర్లకు నిప్పంటించారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. సీఎం సర్బానంద సోనోవాల్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. డిబ్రూగఢ్‌ - గువాహటిలో పోలీసులు లాఠీచార్జి చేశారు. త్రిపుర రాజధాని అగర్తల - పశ్చిమబెంగాల్‌ లోని పలుప్రాంతాల్లో కూడా నిరసనలు జరిగాయి. మరోవైపు - నార్త్‌ ఈస్ట్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌ ఈఎస్‌వో) మంగళవారం 11 గంటల బంద్‌ కు పిలుపునిచ్చింది.
Tags:    

Similar News