నెలాఖ‌రు వ‌ర‌కూ తెలంగాణ‌లో పండుగ వాతావ‌రణం!

Update: 2019-06-15 06:07 GMT
దేశంలో చాలామంది ముఖ్య‌మంత్రులు ఉన్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాదిరి వ్య‌వ‌హ‌రించే సీఎం మ‌రెక్క‌డా క‌నిపించ‌దు. ఆయ‌న తీరు చిత్ర‌విచిత్రంగా ఉంటుంది. ఆయ‌న ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అంచ‌నాల‌కు అంద‌రి రీతిలో ఉంటాయి.

తొలి ద‌ఫా ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన వేళ‌లో.. రోజుకో వ‌రం చొప్పున‌.. ఆయ‌న ప్ర‌క‌టించిన వ‌రాలు అప్ప‌ట్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మ‌రోసారి ఇదే త‌ర‌హాలో ఆయ‌న వ‌రుస పండుగ‌ల‌కు తెర తీశారు. ఈ నెల 17 మొద‌లు.. నెలాఖ‌రు వ‌ర‌కు వ‌రుస కార్య‌క్ర‌మాల్ని ఆయ‌న నిర్వ‌హించ‌నున్నారు. ఈ నెల 17న ఆయ‌న హైద‌రాబాద్‌ లోని ఎమ్మెల్యేల కొత్త క్వార్ట‌ర్ల‌ను ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ స‌ముదాయం ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ‌చిత్రాన్ని మార్చేసే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న కేసీఆర్ డ్రీం ప్రాజెక్టు కాళేశ్వ‌రం ప్రాజెక్టును 21న ప్రారంభించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని సాదాసీదా మాదిరి కాకుండా పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొనేలా చేయాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్స‌వానికి ముందు యాగాలు.. హోమాల‌తో పాటు పెద్ద ఎత్తున పూజ‌లు.. భోజ‌నాల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని అంద‌రూ గుర్తుంచుకునేలా నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ హ‌డావుడి కాస్త త‌గ్గిన వెంట‌నే.. త‌న క‌ల‌ల ప్రాజెక్టు అయితే కొత్త స‌చివాల‌యానికి శంకుస్థాప‌న చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న కేసీఆర్‌.. అందుకు త‌గ్గ ఏర్పాట్ల‌ను సిద్ధం చేయాల‌ని అధికారుల్ని కోరిన‌ట్లు తెలుస్తోంది. స‌చివాల‌యం శంకుస్థాప‌న‌ను ఈ నెల 26 లేదంటే 27 తేదీల్లో నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఇన్ని కార్య‌క్ర‌మాల మ‌ధ్య కేసీఆర్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నా ముడిప‌డ‌ని.. కొత్త అసెంబ్లీ భ‌వ‌నానికి కూడా శంకుస్థాప‌న‌కు ప్లాన్ చేసుకుంటే ఆ ముచ్చ‌ట తీరిపోతుంది. మ‌రి.. కాస్త ఆలోచించ‌రాదే సారూ?
Tags:    

Similar News