శశికళకు ఇంకా ఛాన్సుందా?

Update: 2017-02-14 11:57 GMT
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి సీఎం కుర్చీ కలలు భగ్నమైన అన్నాడీఎంకే చీఫ్ శశికళకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఇంకా ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు కొందరు. ప్రజాప్రాతినిధ్య చట్టం.. రాజ్యాంగంలోని వెసులుబాట్ల ప్రకారం ఆమె సీఎం కావడానికి ఓ మార్గముందని చెబుతున్నారు. అయితే.. నైతికంగా అది అసంభవమని అంటున్నారు.
    
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లకు పైగా శిక్ష పడినవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అంతేకాదు.. శిక్ష ముగిసిన తరువాత ఆరేళ్ల వరకు కూడా అనర్హత ఉంటుంది. ఈ లెక్కన శశికళకు నాలుగేళ్ల శిక్ష పడింది.. అందులో ఆమె ఇప్పటికే అనుభవించిన జైలు జీవితం ఆరు నెలల కాలాన్ని తీసేస్తే ఇంకా మూడున్నరేళ్ల శిక్ష ఉంటుంది. ఆ తరువాత మరో ఆరేళ్లు కలిపితే తొమ్మిదన్నరేళ్ల వరకు ఆమె పోటీ చేసే ఛాన్సు లేనట్లే.
    
అయితే.. ఇక్కడే ఓ వెసులుబాటు ఉందని చెబుతున్నారు. అన్నా డీఎంకేలోని మెజారిటీ ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతిచ్చి సీఎంగా ఎన్నుకుంటే... మిగతా పార్టీలు కానీ, అన్నాడీఎంకేలోని ఇంకో నేత కానీ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు పొందలేకపోతే.. శశికళ మాత్రమే బలం నిరూపించుకుంటే ఆమె సీఎం కావొచ్చు. కానీ, అక్కడి ఆరు నెలల్లో ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. అందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం అంగీకరించదు. అంటే ఆరు నెలల పాటు ఆమె సీఎంగా ఉండొచ్చన్న వాదన ఒకటుంది. ఆరు నెలల తరువాత మళ్లీ ఆమె పదవి కోల్పోయాక ఇంకెవరూ సీఎం కాలేకపోతే మరోసారి అన్నాడీఎంకే నేతలు ఆమెనే ఎన్నుకుంటే మళ్లీ మరో ఆరు నెలలు సీఎం కావొచ్చు. ఇలా మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు కూడా ఆర్నెళ్లకోసారి పదవి పోగొట్టుకుంటూ మళ్లీ సంపాదిస్తూ కొనసాగొచ్చన్న వాదన ఉంది. అయితే.. ఆమె జైలుకు కాకుండా బెయిలుపై బయట ఉంటేనే ఇది సాధ్యం. లేదంటే. . జైలు నుంచి పాలన సాధ్యం కాదు కాబట్టి గవర్నరు రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చు. లేదంటే ఆమె రివ్యూ పిటీషన్ వేసి.. నిర్దోషిత్వం నిరూపించుకోగలిగినా అంతవరకు ఇలా సీఎంగా కొనసాగొచ్చు. కానీ... అంత సిగ్గుమాలి సీఎంగా కొనసాగితే దేశ రాజకీయ చరిత్రకే అది మచ్చగా మారుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News