అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విబేధాలు!

Update: 2019-10-11 11:38 GMT
అధికారంలోకి వచ్చాకా  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తొలి సారి విబేధాలు రచ్చకు ఎక్కుతున్నాయి నెల్లూరు జిల్లాల్లో. మంత్రి వర్గ కూర్పు దగ్గర నుంచి మిగతా జిల్లాల్లో కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నా అక్కడ ఎవరూ బయటపడటం లేదు. అయితే నెల్లూరు జిల్లాల మాత్రం రాజకీయ విబేధాలకు ఎప్పుడూ కేరాఫ్ గా ఉంటుంది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది.

అక్కడ కాంగ్రెస్ లో చాలా గ్రూపులు ఉండేవి. ఒకరంటే మరొకరికి పడేది కాదు.  అది కాంగ్రెస్ కాబట్టి అలాంటి రాజకీయాలు అన్నీ చెల్లాయి. అయితే ప్రాంతీయ పార్టీల్లో అలాంటి విబేధాలకు ఆస్కారం ఉండదు - ఉండకూడదు. అయితే నెల్లూరు జిల్లా నేతలు మాత్రం మారలేదని తెలుస్తోంది.

ఇప్పుడు అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులు ఆరు రచ్చలు అన్నట్టుగా ఉందట వ్యవహారం. ఎన్నికలకు ముందు అంతా ఉమ్మడిగా పని చేసిన నేతలు - తీరా అధికారంలోకి వచ్చాకా మాత్రం తీవ్రంగా
కలహించుకుంటున్నారని సమాచారం. మంత్రి పదవులు రెండూ జూనియర్లకు దక్కడంతో సీనియర్లు చాలా అసహనంతో ఉన్నారట.

ఆ  జిల్లాలకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు - మేకపాటి గౌతమ్ రెడ్డికి కీలకమైన మంత్రి పదవులు దక్కిన సంగతి తెలిసిందే. దీంతో మొదట్లోనే సీనియర్లు కామ్ అయిపోయారు. ఆ మంత్రులను పెద్దగా పట్టించుకోవడం లేదట వీళ్లు. వారిని పిలవడం - నియోజకవర్గాలకు రమ్మనే ప్రోగ్రామ్ లు కూడా లేవట. సొంత జిల్లా వాళ్లే అయినప్పటికీ ఆ మంత్రులను వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదట.

ఆ సంగతలా ఉంటే.. ఆదాల ప్రభాకర్ రెడ్డి - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - కాకాణి గోవర్ధన్ రెడ్డిల రాజకీయం తీవ్ర స్థాయికి చేరిందట. వీరికి ఒకరంటే మరొకరికి పడటం లేదని తెలుస్తోంది. ఇటీవల కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం అరెస్టు వరకూ వెళ్లడానికి కారణం కాకాణి - ఆదాలలే  అనే టాక్ కూడా ఉంది.

ఇప్పటికే నెల్లూరు జిల్లా నేతలను పిలిపించుకుని జగన్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ హయాంలో చేసినట్టుగా చేస్తే కుదరదని - జాగ్రత్తగా నడుచుకోవాలని జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నేతలకు గట్టిగా ఆదేశాలు చేస్తున్నట్టుగా సమాచారం. మరి ఇప్పటికే  ముదిరిన విబేధాలు ఎంత వరకూ పరిష్కారం అవుతాయనేది  ఆసక్తిదాయకంగా మారిందిప్పుడు.
Tags:    

Similar News