కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు.. ప్రధానికి కేజ్రీవాల్‌ లేఖ!

Update: 2022-10-28 09:30 GMT
కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలను ఉంచాలన్న తన డిమాండ్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ రెట్టింపు చేశారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఇది సహాయపడుతుందని కేజ్రీవాల్‌ తెలిపారు. హిందూ దేవతల చిత్రాలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేయాలని ఆయన లేఖలో ప్రధానిని కోరారు.

కరెన్సీ నోట్లపై ప్రస్తుతమున్న మహాత్మా గాంధీతో పాటు లక్ష్మీ దేవి, గణేష్‌ల చిత్రాలను ఉంచాలని130 కోట్ల మంది భారతీయుల తరపున అభ్యర్థిస్తున్నానని ఆ లేఖలో కేజ్రీవాల్‌ ప్రధానికి విన్నవించారు.

దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వాన్నమైన దశలో ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న పేద దేశంగానే ఉందని కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు కష్టపడి పనిచేసినా దేవుని ఆశీర్వాదం కూడా అవసరమన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీకి హిందీలో రాసిన తన లేఖను కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో కూడా పోస్ట్‌ చేశారు. కరెన్సీ నోట్లపై దేవుడి బొమ్మల పట్ల్ల ప్రజలు ఆసక్తిగా ఉన్నారన్నారు. సాధ్యమైనంత త్వరగా అమలుపరచాలని కోరుకుంటున్నారని చెప్పారు.

కాగా కేజ్రీవాల్‌ డిమాండ్‌పై కాంగ్రెస్, బీజేపీ నిప్పులు చెరుగుతున్నాయి. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేజ్రీవాల్‌ ఈ డిమాండ్‌ చేస్తున్నారని ఆ రెండు పార్టీలు ధ్వజమెత్తాయి. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో హిందువుల ఓట్లను కొల్లగొట్టడానికే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డాయి.

కాగా ఆమ్‌ ఆద్మీ పార్టీ హిందూ వ్యతిరేకి అని ముద్రను పోగొట్టుకోవడానికే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ డిమాండ్‌ను తలకెత్తుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కరెన్సీ నోట్లపై హిందు దేవుళ్ల చిత్రాలు ముద్రించాలని కోరడం ద్వారా కొంతలో కొంత ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోవచ్చని కేజ్రీవాల్‌ భావిస్తున్నారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full ViewFull View
Tags:    

Similar News