సినీ పరిశ్రమ జనాల రక్తం తాగుతోంది: సీఎం

Update: 2018-11-11 08:37 GMT
తమిళనాట ఇప్పుడు సినీ పరిశ్రమకు.. రాజకీయ రంగానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జయలలిత మరణించినప్పటి నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించడానికి సినీ పరిశ్రమ నుంచి దిగ్గజాలు రంగంలోకి దిగుతున్నారు. జయ మరణం తర్వాత తమిళనాడు సీఎం కుర్చీ కోసం జరిగిన గొడవపై సినీ జనాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అవకాశం దొరికినపుడల్లా రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తున్నారు. సినిమాల్లో రాజకీయ నాయకులపై సెటైర్ల మామూలుగా పడట్లేదు. అదే సమయంలో రాజకీయ నాయకులు కూడా సినీ జనాలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ‘సర్కార్’ సినిమా సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ మరింత పెరిగింది. ఈ చిత్రంలో అన్నాడీఎంకే సహా వివిధ పార్టీలపై సెటైర్లు పడ్డాయి.

దీంతో సినిమాను రీ సెన్సార్ చేయించాల్సిన అవసరం ఏర్పడింది. కొన్ని సన్నివేశాలు, డైలాగుల్ని తీసేసి.. కొన్ని చోట్ల మ్యూట్ చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. దీంతో ప్రభుత్వంపై సినీ జనాలు విరుచుకుపడుతున్నారు. ఐతే ఇన్నాళ్లూ సైలెంటుగా ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి.. రివర్స్ గేర్ వేశాడు. సినీ పరిశ్రమను టార్గెట్ చేశాడు. ఫిలిం ఇండస్ట్రీ జనాల రక్తం తాగుతోందంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 100 రూపాయల టికెట్‌ ను సినిమా రిలీజ్ టైంలో రూ.1000కి అమ్ముతున్నారని.. ఇదేం అన్యాయమని ఆయన ప్రశ్నించారు. ‘సర్కార్’ సినిమాలోని సన్నివేశాలపై సామాన్య జనమే అభ్యంతరాలు చెప్పారని.. ఈ నేపథ్యంలోనే వాటిని తొలగించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఈ సినిమా పోస్టర్లు.. బేనర్లను చించేశారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మంచి పథకాల్ని విమర్శిస్తే రాజకీయాలతో సంబంధం లేకుండా జనాలకు కోపం వస్తుందని.. ‘సర్కార్’ విషయంలో అదే జరిగిందని ఆయనన్నారు.
Tags:    

Similar News