ఆ సీఎం బాహుబలి-2 చూసి బుక్కయ్యాడు

Update: 2017-05-09 06:48 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు ఇప్పుడో కొత్త తలనొప్పి పట్టుకుంది. కన్నడ సినిమాల నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టేస్తున్నారు. మా సినిమా చూడండంటే మా సినిమా చూడండంటూ ఆయన్ని బలవంత పెట్టేస్తున్నారు. స్వతహాగా సినిమా ప్రియుడైన సిద్ధరామయ్య.. ఈ మధ్య వరుసబెట్టి మూణ్నాలుగు సినిమాలు చూసేయడమే ఇందుకు కారణం. సీఎం సినిమా చూస్తే చూశారు కానీ.. దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరిగిపోవడంతో వచ్చింది తంటా. సిద్ధరామయ్య ఈ మధ్య సినిమాలు చూస్తుండగా ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాల షేర్ చేయడంతో మిగతా నిర్మాతలు మా సినిమా చూడండంటూ ఏకంగా క్యాంపు కార్యాలయానికే క్యూ కట్టేస్తున్నారు.

కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ నటించని ‘రాజకుమార’ సినిమాను ఇటీవలే సిద్ధరామయ్య చూశారు. దీనికి సంబంధించిన ఫొటోను సీఎంవో సిబ్బంది సోషల్ మీడియాలో పెట్టారు. అంతటితో కథ ముగిసిపోయి ఉంటే బాగుండేది. ఐతే సిద్ధరామయ్య ఇటీవలే యూఏఈలో ప్రభుత్వం తరఫున కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తిరిగొచ్చే సమయంలో ఆటవిడుప కోసం ఒకే రోజు ‘బాహుబలి: ది కంక్లూజన్’తో పాటు ‘నిరుత్తర’ అనే కన్నడ సినిమాను కూడా చూశారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. దీంతో సిద్ధరామయ్య రెగ్యులర్‌ గా సినిమాలు చూస్తున్నారని భావించి.. నిర్మాతలు మా సినిమా ప్రత్యేక షో వేస్తాం చూడండంటూ ఆయన దగ్గరికి వస్తున్నారు. సీఎం సినిమా చూశాడంటే దాని ద్వారా చాలా ప్రచారం వస్తుంది కాబట్టి సీఎం కార్యాలయం దగ్గర.. ఇంటి వద్ద నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఐతే అనుకోకుండా సినిమాలు చూశారు తప్ప.. ఇప్పుడు అదే పనిగా సినిమాలు చూసేంత తీరిక.. ఓపిక సీఎంకు లేదంటూ సిబ్బంది నిర్మాతలకు నచ్చజెప్పి పంపిస్తున్నారు.
Tags:    

Similar News