ట్రైయిన్ రివర్స్.. బ్రిటన్ రాజుకు బిన్ లాడెన్ ఫ్యామిలీ విరాళాలు.. దారుణమే?

Update: 2022-08-01 14:30 GMT
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సృష్టించిన బ్రిటన్ దేశానికి ఇది నిజంగా అపఖ్యాతినే. బ్రిటన్ రాజవంశానికి ఆఖరుకు ఉగ్రవాద కుటుంబం విరాళాలు ఇవ్వడం అంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదంటారు. తాజాగా బ్రిటన్ యువరాజు చార్లెస్ ఛారిటబుల్ ట్రస్ట్ విరాళాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆల్ ఖైదా నేత ఒసామా బిన్లాడెన్ కుటుంబం నుంచి విరాళాలు స్వీకరించిందని యూకే మీడియా బాంబు పేల్చింది.ఇది పెద్ద దుమారం రేపింది.

అల్ ఖైదా చీఫ్ కు సమీప బంధువైన బకర్ ఏకంగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ ను లండన్ లో కలిసి దాదాపు రూ.10లక్షల విరాళం అందించినట్లు ది సండే టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఛారిటబుల్ ఫండ్ పేరుతో 1986 నుంచి బ్రిటన్ యువరాజు చార్లెస్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే 2013లో ప్రిన్స్ చార్లెస్ తో ఒసామా బిన్ లాడెన్ సోదరుడు షేక్ బకర్ బిన్ లాడెన్ లండన్ లో భేటి అయ్యారట.. ఆ సందర్భంలోనే బకర్ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇచ్చేయాలని రాయల్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కోరినట్లు తాజా కథనం వెల్లడించింది.

ఇక ఈ నిర్ణయంతో ప్రిన్స్ వ్యక్తిగత ప్రమేయం లేదని రాయల్ కుటుంబ కార్యాలయం తెలిపింది. ఆ విరాళాలను స్వీకరించడంలో అన్ని నిబంధనలు పాటించామని .. ఐదుగురు ట్రస్టీ సభ్యుల ఆమోదంతోనే వాటిని స్వీకరించారని ట్రస్ట్ తెలిపింది.

ఇక ఈ విరాళాల కుంబకోణంలో మరో ట్విస్ట్ ఏంటంటే.. బ్రిటన్ యువరాజు చార్లెస్ ఖతర్ దేశం నుంచి 30 లక్షల యూరోల మేర విరాళాలను నగదు రూపంలో సూట్ కేసు లో స్వీకరించారని గతనెలలోనూ వార్తలు వచ్చాయి. ఖతర్ మాజీ ప్రధాని నుంచి ఈ మొత్తం ప్రిన్స్ తీసుకున్నట్లు బ్రిటన్ మీడియా తెలిపింది.

రాజ కుటుంబానికి చెందిన వారి ప్రాజెక్టులకు దీని నుంచి గ్రాంట్ అందుతోందని వార్తలు వచ్చాయి. ఈ చెల్లింపులు అక్రమమని కథనం పేర్కొనలేదు. దాత ఇష్టం మేరకు విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు.

మొత్తం ప్రపంచంలో తన పేరు పలుకుబడిని వినియోగించుకొని బ్రిటన్ లో లబ్ధి పొందేందుకు కొందరు ప్రిన్స్ చార్లెస్ కు విరాళాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అందివచ్చిన విరాళాలను వివిధ రూపాల్లో ప్రిన్స్ తీసుకున్నట్లుగా ఇప్పుడు దుమారం రేపుతోంది. దీన్ని ఖండించిన కూడా ఈ వార్తలు ఆగడం లేదు.
Tags:    

Similar News