జీఎస్టీ మీద ప్ర‌జంటేష‌న్లు మొద‌లెట్టిన జైట్లీ!

Update: 2017-10-24 14:44 GMT
ఎంత‌టి తోపు నేత‌లైనా స‌రే.. ఎన్నికలు వ‌స్తున్నాయంటే చాలు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవ‌టం క‌నిపిస్తుంటుంది. ఇందుకు కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ బాబాయ్ మిన‌హాయింపు కాదు. తిరుగులేని రీతిలో సాగుతున్న మోడీ పాల‌న‌కు పెద్ద స్పీడ్ బ్రేక‌ర్ గా మార‌ట‌మే కాదు..అప్ప‌టివ‌ర‌కూ ఉన్న ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిన ఘ‌న‌త జీఎస్టీకే ద‌క్కుతుంది.

అర్థ‌రాత్రివేళ‌.. పార్ల‌మెంటులో ఘ‌నంగా గంట కొట్టి మ‌రీ స్టార్ట్ చేసిన జీఎస్టీ ఎఫెక్ట్ ఎంత‌గా ఉంటుంద‌న్న ముచ్చ‌ట దేశ ప్ర‌జ‌ల‌కు బాగానే అర్థ‌మైంది.

దీంతో.. జీఎస్టీ ముందు వ‌ర‌కూ మోడీని నెత్తిన మోసిన వారు సైతం.. ఇప్పుడు కింద‌ప‌డేసి చావు తిట్లు తిట్టేస్తున్నారు. అంతేనా.. మోడీని హీరోగా కీర్తించే గుజ‌రాత్ వ్యాపారులు సైతం రోడ్ల మీద‌కు వ‌చ్చి భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు. అయితే.. మీడియా మీద మోడీ స‌ర్కారుకు ఉన్న ప‌ట్టు పుణ్య‌మా అని చాలా విష‌యాలు బ‌య‌ట‌కు రాలేదు కానీ.. అదే మ‌న్మోహ‌న్ స‌ర్కారు అయితే ఈపాటికి యావ‌ద్దేశం గ‌గ్గోలు ఎత్తేసేది. కానీ.. మోడీ స‌ర్కారు కావ‌టంతో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది.

మీడియా మౌనంగా ఉన్నంత మాత్రాన ప‌న్ను మంట‌తో ఠారెత్తిపోతున్న ప్ర‌జ‌లు ఊరుకోరు క‌దా. గ‌తంలో అయితే.. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నార‌న‌టానికి మీడియా ఉండేది. ఇప్పుడు అంత‌కు మించిన సోష‌ల్ మీడియా ఉండ‌నే ఉంది. దీంతో.. త‌మ మ‌న‌సులోని ఆగ్ర‌హాన్ని ఓపెన్ గా వ్య‌క్తం చేస్తూ మోడీ అండ్ కో మీద కారాలు మిరియాలు నూరేస్తున్నారు. జీఎస్టీ కార‌ణంగా ప్ర‌జ‌ల్లో కొంత ఆగ్ర‌హం రావొచ్చ‌న్న అంచ‌నా ఉన్న‌ప్ప‌టికీ మ‌రీ ఇంత తీవ్ర‌స్థాయిలో ఉంటుంద‌ని అంచ‌నా వేయ‌లేని మోడీ ప‌రివారానికి జీఎస్టీ ఓ పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

ఇలాంటి వేళ‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి వ‌రుస క్ర‌మంలో రానుండ‌టంతో కేంద్రం అలెర్ట్ అయ్యింది. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు అనివార్యంగా మార‌ట‌మే కాదు.. ఈ గెలుపుతో రెట్టించిన ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తోంది. ఇందులో ఏ మాత్రం లెక్క తేడా కొట్టినా మోడీ బ్యాచ్‌ కి త‌గిలే దెబ్బ మామూలుగా ఉండ‌దు.

అందుకే కాబోలు.. జీఎస్టీ మీద ఇప్పుడు పవ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్లు షురూ చేశారు కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీ. నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ పుణ్య‌మా అని దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింద‌న్న విమ‌ర్శ‌ల‌కు బ‌ల‌మైన స‌మాధానం ఇచ్చేందుకు వీలుగా ఒక ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్‌ ను సిద్దం చేశారు. మూడేళ్లుగా దేశం దూసుకుపోతుంద‌ని.. తాము చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌లు మంచి ఫ‌లితాలు ఇస్తాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు జైట్లీ.

ఇటీవ‌ల విడుద‌లైన జీడీపీ గ‌ణాంకాల్లో వృద్ధిరేటు ప‌డిపోయిన మాట వాస్త‌వమే అయినా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్రం లేద‌న్న జైట్లీ.. భార‌త ఆర్థిక‌వ్య‌వ‌స్థ ఇప్ప‌టికి ప‌టిష్టంగా ఉంద‌న్నారు. జీఎస్టీ లాంటి భారీ సంస్క‌ర‌ణ‌లు చేసిన‌ప్పుడు మొద‌ట్లో కొన్ని ఇబ్బందులు మామూలేన‌ని.. ఫ్యూచ‌ర్ లో మంచి ప‌లితాలు త‌ప్ప‌క వ‌స్తాయ‌న్నారు. వృద్ధిరేటు త‌గ్గిన నేప‌థ్యంలో దాన్ని పెంచేందుకు వీలుగాఏం చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న అంశంపై ఆర్థిక శాఖ‌లోనూ.. ఇటు ప్ర‌ధాని మోడీతోనూ నిత్యం చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లుగా చెప్పారు. ఎప్పుడూ ఇవ్వ‌నంత వివ‌ర‌ణ‌.. అది కూడా జీఎస్టీ మీద ఇస్తున్న జైట్లీ తీరు చూస్తేనే.. జీఎస్టీ మీద మోడీ స‌ర్కారు ఎంత డిపెన్స్ లో ప‌డింద‌న్న విష‌యం అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News