మారుతికి రూ.200 కోట్ల ఫైన్.. అంత పెద్ద తప్పేం చేసింది?

Update: 2021-08-24 03:11 GMT
ప్రఖ్యాత కార్ల కంపెనీ మారుతి సుజుకి సంస్థకు దిమ్మ తిరిగిపోయే భారీ జరిమానా ఒకటి పడింది. తాజాగా సదరు కంపెనీకి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) భారీ జరిమానాను విధించింది. వినియోగదారులకు డీలర్లు ఇచ్చే రాయితీలపై నియంత్రణల్ని విధించటం ద్వారా వినియోగదారులకు దక్కే ప్రయోజనాలు దక్కకుండా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అందిన ఫిర్యాదుపై విచారణ జరిపిన సీసీఐ తాజాగా మారుతికి రూ.200 కోట్ల ఫైన్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. డిస్కౌంట్ కంట్రోల్ పాలసీని నిలిపివేయాలని కూడా ఆదేశించింది.

అదే సమయంలో తాము వేసిన ఫైన్ ను రెండు నెలల పరిమిత కాల వ్యవధిలో చెల్లించాల్సిన స్పష్టం చేసింది. ఇంతకీ అంత భారీ జరిమానా పడేంత పెద్ద తప్పు మారుతి ఏం చేసిందన్న విషయంలోకి వెళితే.. దాదాపు రెండేళ్ల క్రితం ఈ సంస్థపై సీసీఐకు కంప్లైంట్ అందింది. దీని సారాంశం ఏమంటే.. మనం కొత్త కారు కొనేందుకు మారుతి షోరూంకి వెళ్లి.. ఫలానా కారు కావాలని చెప్పి.. రేటు అడుగుతాం. దాని మీద ఆఫర్లు ఏం ఉన్నాయని కూడా అడగటం కామన్.

దానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్  సమాధానం ఇస్తూ.. సదరు కారు మీద ఉన్న ఆఫర్లు చెబుతాడు. మనం ఇంకేమైనా అదనపు ఆఫర్లు ఉన్నాయా? మాకు ఇస్తారా? అని అడుగుతాం. అలా పదే పదే అడిగిన సమయంలో సదరు సేల్స్ ఎగ్జిక్యుటివ్ నోటి నుంచి ఒక మాట వస్తుంది. సరే.. ఇదే ఫైనల్ ధర. ఇంతకంటే తక్కువ మరే మారుతి షోరూంలోనూ ఉండదు సార్. ఒకవేళ.. ఇంతకంటే తక్కువకు ఇస్తానంటే చెప్పండి.. వారి డీలర్ షిప్ క్లోజ్ అయిపోతుందని చెబుతారు.

పెద్ద కంపెనీల ప్రొడక్టులు కొనే వేళలో.. ఇలాంటి మాటలు తరచూ వింటుంటాం. వినేందుకు బాగానే ఉన్నప్పటికీ.. చట్ట ప్రకారం చూసినప్పుడు పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే.. మనం కొనే షాపు అతనికి తక్కువ లాభానికి తన దగ్గర ఉన్న వస్తువును అమ్మాలని అనుకున్నా.. కంపెనీ మాత్రం పాలసీ పేరుతో వారిని కంట్రోల్ చేసి.. ఫలానా ధరకు మాత్రమే అమ్మాలి. తేడా వస్తే మీ సంగతి చూస్తాం.. మీ డీలర్ షిప్ కు దెబ్బ పడుతుందంటూ బెదిరిస్తుంటాయి. దీంతో.. కొన్ని సందర్భాల్లో ఇచ్చే ధరకు మించి.. వేరే ధరకు బిల్ చేయటం అప్పుడప్పుడు చూస్తుంటాం.

అయితే.. ఈ పద్దతిలో వినియోగదారులకు నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే.. ఎవరైనా డీలర్.. తక్కువ లాభానికి  కారు అమ్మాలని అనుకున్నా.. కంపెనీ పాలసీ కారణంగా ఒక ధరకు మించి తక్కువకు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే.. ఈ తీరును సీసీఐ తప్పు పడుతుంది. ఇలా తప్పులు చేసే వారి సమాచారాన్ని సేకరించి.. వారి వద్దకు తన ప్రతినిధులను కస్టమర్ల ద్వారా పంపుతుంది. ఇదేమీ తెలియని షోరూం యజమాని.. అక్కడున్న  సేల్స్ ఎగ్జిక్యూటివ్ మాత్రం కంపెనీ పాలసీ గురించి చెప్పేసి.. సేల్ క్లోజ్ చేయాలని కోరతారు.

ఇలాంటి తీరు కారణంగా వినియోగదారులకు మరింత తక్కువ ధరకు కారు వచ్చే వీలున్నా రాలేని పరిస్థితి. అందుకే.. వినియోగదారుల ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా మారుతి ఇంటర్నెల్ పాలసీ ఉందన్న విషయాన్ని గుర్తించిన సీసీఐ తాజాగా రూ.200 కోట్ల ఫైన్ వేసింది. డీలర్లకు కంపెనీ నుంచి ఒత్తిడి లేకుంటే.. మరింత ముందుకు దూసుకెళ్లేలా పరిస్థితులు ఉండే వీలుంది.

అందుకే.. వేలాది మంది వినియోగదారుల్ని మోసం చేయటం.. ఒత్తిడితో అదనపు రాయితీలు ఇవ్వకపోవటం కూడా వినియోగదారుల ప్రయోజనాల్ని దెబ్బ తీసిందన్న ఫిర్యాదుపై స్పందించి తగు రీతిలో విచారణ జరిపి..  భారీ జరిమానాను  విధించారు. రెండు నెలల్లో ఈ మొత్తాన్ని చెల్లించని పక్షంలో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీనిపై స్పందించిన మారుతి.. న్యాయసూత్రాలకు అనుగుణంగా తాము కోర్టును ఆశ్రయిస్తామని.. కోర్టు చప్పినట్లు చేస్తామని మారుతి పేర్కొంది. మరేం జరగాలో చూడాలి.
Tags:    

Similar News