సూసైడ్‌ కు కార‌ణం ఆర్నాబ్‌.. కేసు న‌మోదు!

Update: 2018-05-07 07:49 GMT
పాత్రికేయుడికి స‌మాజం ప‌ట్ల అనుర‌క్తి స‌హ‌జం. తాను ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిలుస్తాన‌ని ప్ర‌తి జ‌ర్న‌లిస్టు చెబుతుంటారు. కానీ.. దేశంలో ఇంతమంది పాత్రికేయులు ఉన్నా.. ఎవ‌రిలో లేని తీరు రిప‌బ్లిక్ ఛాన‌ల్ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామిలో క‌నిపిస్తుంది.

ద నేష‌న్ వాంట్స్ టు నో అంటూ విరుచుకుప‌డే గోస్వామిని ఇష్ట‌ప‌డే వారెంత మందో.. ఆయ‌న్ను తీవ్రంగా త‌ప్పు ప‌ట్టే వారు అంతే మంది క‌నిపిస్తారు. ఎంత జ‌ర్న‌లిస్ట్ అయితే మాత్రం.. స్టూడియోలో కూర్చొని న్యాయ‌మూర్తి మాదిరి తీర్పులు ఇచ్చేయ‌టం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అని పలువురు ప్ర‌శ్నిస్తుంటారు. తాను ప‌ని చేసిన ఛాన‌ల్ కు గుడ్ బై చెప్పేసి.. తాను సొంతంగా రిప‌బ్లిక్ ఛాన‌ల్ పెట్టేసుకున్న ఆర్నాబ్‌.. తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ముంబ‌యిలో చోటు చేసుకున్న ఒక సూసైడ్‌కు ఆయ‌న‌కు లింకు ఉంద‌న్న ఆరోప‌ణ వినిపిస్తోంది.

రిప‌బ్లిక్ ఛాన‌ల్ కు ఇంటీరియ‌ర్ డిజైన్ చేసిన నేప‌థ్యంలో త‌న‌కు రావాల్సిన రూ.5.40 కోట్ల‌ను ఇవ్వ‌కుండా ఆర్నాబ్ ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపిస్తూ ఒక ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ సూసైడ్ చేసుకోవ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. త‌న భ‌ర్త అన్వాయ్ నాయ‌క్ రిప‌బ్లిక్ ఛాన‌ల్ కు ఇంటీరియ‌ర్ డిజైన్స్ అందించార‌ని.. దీనికి సంబంధించి బిల్లు ఎంతోకాలంగా పెండింగ్ లో ఉంద‌ని.. సూసైడ్ చేసుకున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ స‌తీమ‌ణి ఆరోపిస్తున్నారు

త‌న ఫార్మ్ హౌస్ ద‌గ్గ‌ర సూసైడ్ చేసుకున్న అన్వాయ్‌.. త‌న మ‌ర‌ణానికి కార‌ణం ఆర్నాబ్‌గా పేర్కొన్న‌ట్లుగా చెబుతున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా చేసుకున్న పోలీసులు రిప‌బ్లిక్ ఛాన‌ల్ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్‌పై కేసు న‌మోదు చేశారు. త‌న‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎంత‌కూ చెల్లించ‌క‌పోవ‌టం.. ఈ విష‌యంలో తీవ్ర మ‌న‌స్తాపానికి గురై తాను మ‌ర‌ణించిన‌ట్లుగా ఆర్నాబ్ తీరును త‌ప్పు ప‌ట్టిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. సూసైడ్ నోట్ లో చెబుతున్న విష‌యాల‌కు.. వాస్త‌వాల‌కు సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేస్తోంది రిప‌బ్లిక్ ఛాన‌ల్‌. అన్వాయ్ చేత త‌మ ఛాన‌ల్‌ కు ఇంటీరియ‌ర్ చేయించుకున్న మాట వాస్త‌వ‌మేన‌ని.. అయితే.. వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎప్పుడో ఇచ్చేశామ‌ని.. ఇప్పుడు ఇవ్వ‌లేద‌ని చెప్ప‌టం అర్థం లేద‌ని చెబుతున్నారు. ఆర్నాబ్ పై కేసు న‌మోదు చేసిన ముంబ‌యి పోలీసులు తాజాగా కేసును విచారిస్తున్నారు.
Tags:    

Similar News