మహా విషాదం: కొల్లం కోవెల అగ్నిప్రమాదం అప్ డేట్స్

Update: 2016-04-10 09:37 GMT
దేవతార్చనలో మునిగిపోయిన భక్తులు ఊహించని ప్రమాదంలో చిక్కుకోవటమే కాదు.. వారి కుటుంబాలు పెను విషాదంలో మునిగిపోయే దారుణ ఘటన కేరళలో చోటు చేసుకోవటం తెలిసిందే. పుట్టింగల్ ఆలయ చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణ అగ్నిప్రమాదం చోటు చేసుకోవటం తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా భక్తులు సజీవ దహనమయ్యారు. వారిలో కొన్ని మృతదేహాలు గుర్తించలేనంత దారుణంగా కాలిపోవటం అందరిని కలిచివేస్తోంది.

తొలుత 60 మంది అనుకున్నప్పటికీ.. గంటలు గడిచే కొద్దీ ఈ ప్రమాదంలో చిక్కుకొని మరణించిన భక్తుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. మృతి చెందిన భక్తుల సంఖ్య 105కు పెరిగింది. దాదాపు 350 మందికి పైగా భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచా కాల్చటంలో చోటు చేసుకున్న ప్రమాదం.. దారుణ ఘటనకు కారణమైంది. దేవాలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరిని షాక్ కు గురి చేసింది. ఆదివారం సెలవురోజు కావటం.. కాస్త ఆలస్యంగా లేచి న్యూస్ చూసిన వారికి నోట మాట రాని విధంగా ఈ ప్రమాదం ఉంది.

ఈ ప్రమాదానికి సంబంధించి తాజా అప్ డేట్స్ చూస్తే..

= ప్రమాదంలో గాయపడిన వారిని త్రివేండ్రం వైద్య కళాశాలకు.. సమీపంలోని మరికొన్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.

= బాధితుల్లో కాలిన గాయాల తీవ్రత ఉన్న వారే ఎక్కువగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

= ప్రమాదం జరిగిన సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటం.. బయటకువెళ్లే అవకాశం లేకపోవటంతో మృతుల సంఖ్య ఎక్కువైంది.

= ఆలయ వేడుకల్లో భాగంగా బాణసంచాకు లైసెన్స్ లు ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు.

= బాణసంచా పేలుళ్ల కారణంగా కొన్ని భవనాలు సైతం కుప్పకూలిన పరిస్థితి.

= జరిగిన ప్రమాదంపై న్యాయవిచారణకు కేరళ రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది.

= ప్రమాద స్థలిని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పరిశీలించారు. ఘటనాస్థలి నుంచే ప్రధాని మోడీతో మాట్లాడారు.

= ఈ ఘటనలో బాధితులందరిని తాము ఆదుకుంటామని కేరళ సర్కారు అభయమిచ్చింది.

= దేవాలయంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు.

= మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు.. గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

= ఈ దారుణ ప్రమాదం కారణంగా కేరళలో నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్న బీజేపీ చీఫ్ అమిత్ షా రద్దుచేసుకున్నారు.

= కాలిన గాయాలకు వైద్యం చేయటంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్న 15 మంది వైద్యుల్ని తీసుకొని ప్రధాని మోడీ కేరళకు బయలుదేరారు.

= తన పర్యటన సందర్భంగా ఎలాంటి ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
Tags:    

Similar News