మీ ఫ్యామిలీని న‌మ్మి మునిగిపోయాం.. ఇంక న‌మ్మ‌లేం.. ష‌ర్మిల‌కు తేల్చిచెప్పిన ఫైర్ బ్రాండ్‌!?

Update: 2021-04-18 03:30 GMT
తెలంగాణ‌లో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య‌, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌కు అతి పెద్ద శ‌రాఘాతం త‌గిలింది. వైఎస్ ఫ్యామిలీతో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన ఓ సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం ఇప్పుడు చేరువ అయ్యేందుకు స‌సేమిరా అంటోంది. అదే కొండా సురేఖ‌, ముర‌ళి దంప‌తుల కుటుంబం. ప్ర‌స్తుతం ష‌ర్మిల పార్టీ పేరు ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. చాప‌కింద నీరులా.. వైఎస్ అభిమానుల‌ను పోగు చేసే ప‌నిప్రారంభించారు. అంతేకాదు.. గ‌తంలో వైఎస్ ఉన్న‌ప్పుడు ఆయ‌న‌ప‌ట్ల ఆద‌రంగా ఉన్న‌వారిని కూడా చేరువ చేసుకునే ప‌నిచేప‌ట్టారు. ఈ క్ర‌మంలో కొండా సురేఖ వైపు కూడా చూసిన‌ట్టు తెలుస్తోంది.

ఇదే విష‌యం ఇప్పుడు వ‌రంగ‌ల్ జిల్లాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.. జీవించి ఉన్న స‌మ‌యంలో అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. కొండా సురేఖ దంప‌తుల‌కు ప్ర‌త్యేక గౌర‌వం ఇచ్చారు. త‌న ఇంటి మ‌నుషులుగా వారిని చూసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌లో తిరుగులేని నాయ‌కులుగా ఈ కుటుంబం ఎదిగింది. అంతే అభిమానం ఈ కుటుంబం కూడా వైఎస్ ఫ్యామిలీపై చూపించింది. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. కొండా దంప‌తుల‌కు వైఎస్ అంటే ఎంతో అభిమానం.. అంత‌కు మించి ప్రాణం అని చెప్ప‌డంలోనూ అతిశ‌యోక్తి లేదు. అయితే.. వైఎస్ చ‌నిపోయిన త‌ర్వాత‌.. కూడా ఈ కుటుంబం వైఎస్ కుటుంబానికి అంతే అండ‌గా నిలబ‌డింది.

జ‌గ‌న్ కోసం.. అప్ప‌టి మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ త‌న ప‌ద‌విని తృణ ప్రాయంగా వ‌దిలి పెట్టారు. అంతేకాదు.. జ‌గ‌న్ కోసం.. రాజీనామా చేసిన తొలి మంత్రి కూడా సురేఖే. ``నేను జ‌గ‌న్ కోసం నిల‌బ‌తాను. వైఎస్ అంటే.. మాకు ప్రాణం`` అని బ‌హిరంగంగా ప్ర‌క‌టించి.. క‌న్నీటి సుడుల మ‌ధ్య త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు సురేఖ‌. అంతేకాదు.. తెలంగాణలో స‌మైక్య ఆంధ్ర ఉద్య‌మం చేసిన దంప‌తులు కూడా కొండా కుటుంబ‌మే. ఇదంతా ఎవ‌రికోసం జ‌గ‌న్ కోసం.  అలాంటి కుటుంబానికి జ‌గ‌న్ ఏమీ చేయ‌లేదు. పైగా జ‌గ‌న్ పంచ‌న ఉన్నందుకు రాజ‌కీయంగా కూడా ఈ కుటుంబానికి జ‌గ‌న్ చేసింది ఏమీలేదు.

రాజ‌కీయంగా ఇబ్బందులు కూడా ఎదుర‌య్యాయి. జ‌గ‌న్‌ను న‌మ్మిత‌ త‌ర్వాత ఆమె రాజ‌కీయంగా చాలా వెనుక‌బ‌డి పోయార‌నేది కూడా విశ్లేష‌కుల మాట‌. అంతేకాదు.. తెలంగాణ వాదిగా క్రెడిబిలీటీని కూడా పోగొట్టుకున్నారు. అయినా .. కూడా జ‌గ‌న్ వీరిని ప‌ట్టించుకోలేదు. ఈ క్ర‌మంలోనే టీఆర్ ఎస్‌లో చేరారు. అయితే.. అక్క‌డ కూడా ఇమ‌డ‌లేక‌.. తిరిగి మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. గ‌త 2018 ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి పోటీ చేసినా.. ఓడిపోయారు సురేఖ‌. అయితే.. ఇప్పుడు వైఎస్ ష‌ర్మిల‌.. మ‌ళ్లీ సురేఖ వైపు చూస్తున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. అయితే.. కొండా కుటుంబం మాత్రం.. మేము ఇక‌పై త‌ప్పులు చేయ‌ద‌లుచుకోలేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు చెబుతోంద‌ట‌.

అంతేకాదు.. మా కోసం.. మా కుటుంబం కోసం.. మేం కాంగ్రెస్‌లోనే ఉంటామ‌ని కొండా ఫ్యామిలీ స్ప‌ష్టం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ష‌ర్మిల‌కు కొండా కుటుంబంపై చాలా న‌మ్మ‌కం ఉంది. ఈ కుటుంబం క‌నుక ష‌ర్మిల వెంట న‌డిస్తే.. వరంగ‌ల్‌లో ష‌ర్మిల‌కు తిరుగులేకుండా పోతుంది. కానీ, ఇప్పుడు గ‌తంలో ఎదురైన అనుభ‌వాలు, పైగా జ‌గ‌న్‌నుంచే ఎదురైన అవ‌మానాలు త‌లుచుకుని.. కొండా కుటుంబం మౌనంగా ఉండ‌డ‌మే కాకుండా ఖ‌రాకండీగా.. తాము పార్టీ మారేది లేద‌ని స్ప‌స్టం చేసింది. దీంతో ఇప్పుడు మ‌రెవ‌రైనా వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. ష‌ర్మిల ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో ష‌ర్మిల పార్టీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.
Tags:    

Similar News