ఆస్ట్రేలియాలో అగ్నిప్రమాదం.. భారతీయ విద్యార్థి మృతి

Update: 2022-07-14 06:30 GMT
ఆస్ట్రేలియాలో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి చెందడం విషాదం నింపింది. క్యాంప్‌బెల్ స్ట్రీట్‌లో విద్యార్థి ఉంటున్న ఇంటి సమూహాన్ని మంటలు చుట్టుముట్టాయి. అందులో చిక్కుకుని గాయాలపాలైన విద్యార్థిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి వెస్ట్‌మీడ్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించి మరణించాడు. భారతదేశానికి చెందిన ఈ విద్యార్థి మరణంతో పరమట్టలోని ఆస్ట్రేలియన్ కమ్యూనిటీ సంతాపం తెలిపింది.

పారమట్టలోని అపార్ట్‌మెంట్ బ్లాక్‌కు తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి.  అత్యవసర సేవల కోసం పోలీసులకు ఫోన్ చేశారు. పారమట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూడగా మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి.

వెంటనే 27 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మరో 20 ఏళ్ల వ్యక్తి పొగ పీల్చడంతో చికిత్స కోసం వెస్ట్‌మీడ్ ఆసుపత్రికి తరలించారు.  అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్ మెంట్ కింది ఫ్లాట్లను ఖాళీ చేయించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

అగ్ని ప్రమాదంలో మృతిచెందిన భారతీయ విద్యార్థి రౌనక్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి ప్రవాస భారతీయుల సంఘం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. రౌనక్ స్నేహితులు.. పరిచయస్తులు ఎవరైనా సహాయం చేయడానికి తమను సంప్రదించాలని కోరుతున్నారు.  

రౌనక్ 2019 సెప్టెంబర్‌లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నెట్‌వర్కింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసి మంచి జాబ్ సంపాదించి భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు.. తమ్ముడిని ఆదుకోవాలని పెద్ద కలలు కన్నాడని అతడి స్నేహితులు తెలిపారు.  అయితే అర్ధాంతరంగా అగ్ని ప్రమాదంలో మరణించడం విషాదం నింపింది. 'GoFundMe' హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలోనూ నిధుల సేకరణ చేపట్టారు.

యాదృచ్ఛికంగా రౌనక్ తన చివరి సెమిస్టర్‌లో ఉన్నాడు. చదువు పూర్తి కావాల్సిన టైంలో అసువులు బాసాడు. రౌనక్ తన కుటుంబాన్ని చూడటానికి రెండు నెలల్లో భారతదేశానికి వెళ్లాలని అనుకున్నాడు. ఇంతలోనే ఈ ప్రమాదంతో అసువులు బాసాడు.
Tags:    

Similar News