ట్రంప్ వ‌ల్లే ప‌ద‌వి ఊడిందంటున్న ఎఫ్‌ బీఐ చీఫ్‌

Update: 2017-06-09 04:42 GMT
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌నితీరుపై మ‌రో మ‌ర‌క ప‌డింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం వుందన్న ఆరోపణలపై దర్యాప్తు విషయమై ట్రంప్‌ తనపై ఒత్తిడి తెచ్చారని ఎఫ్‌బిఐ మాజీ చీఫ్‌ కొమె అమెరికా సెనెటర్లకు తెలిపారు. ఈ ఆరోపణలకు సంబంధించి జాతీయ భద్రతా మాజీ సలహాదారు మైఖేల్‌ ఫ్లైన్‌ పై దర్యాప్తును విరమించుకోవాలని ట్రంప్‌ తనను కోరారని కొమె చెప్పారు. సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు హాజరు కావడానికి ముందుగా కొమె రాతపూర్వక సాక్ష్యాధారాలను విడుదల చేశారు. ఈ సాక్ష్యాధారాలు ట్రంప్‌ పై మరింత ఒత్తిడి పెంచుతాయని భావిస్తున్నారు.

రష్యా జోక్యం ఉందనే అరోపణలపై జరిగే దర్యాప్తులో మీపై విచారణ జరగదని, మీరు దర్యాప్తు పరిధిలోకి రారని తాను ఇప్పటికే మూడుసార్లు ట్రంప్‌కు చెప్పానని కొమె తెలిపారు. కొమె అలా చెప్పడంతో అధ్యక్షుడు కూడా సంతృప్తి చెందినట్లు ట్రంప్‌ అటార్నీ మార్క్‌ కాసోవిట్జ్‌ తెలిపారు. కాగా ట్రంప్‌ తో తాను పలు సందర్భాల్లో సమావేశమైనపుడు ఆయనతో జరిగిన సంభాషణలను కొమె ఆ సాక్ష్యాధారాల్లో సెనెట్‌ కు అందచేశారు. జనవరి 26న వైట్‌ హౌస్‌ లోని గ్రీన్‌ రూమ్‌ లో ప్రైవేట్‌ డిన్నర్‌ సందర్భంగా సమావేశమైనపుడు ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ గా కొనసాగుతారా లేదా అని తనను ప్రశ్నించారని కొమె చెప్పారు. పైగా 'నాకు విశ్వాసపాత్రులు అవసరం. నా పట్ల విశ్వాసంగా వుండాలని భావిస్తాను.'' అని ట్రంప్‌ తనకు చెప్పారని కొమె తెలిపారు. తద్వారా త‌నపై ఉన్న అభిప్రాయాన్ని ట్రంప్ బ‌య‌ట‌పెట్టుకున్నార‌ని కొమె తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News