ఢిల్లీ హైకోర్టులో ఘోరం : విచారణకు హాజరైన వ్యక్తి పై లాయర్ కాల్పులు .. !

Update: 2021-07-13 11:37 GMT
కోర్టు .. నేరాలు , తప్పులు చేసిన వారికి శిక్షలు విధించే దేవాలయాలు. కోర్టులో న్యాయం జరుగుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ,  కోర్టులు కూడా క్రిమినల్స్ ని భయపెట్టలేకపోతున్నాయి. సాక్షాత్తూ కోర్టులోనే దారుణ నేరాలు జరుగుతున్నాయంటే ఇక న్యాయవ్యవస్థ ఎటు వైపు వెళ్తోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని ద్వారకలో ఉన్న కోర్టు ప్రాంగణంలో  సోమవారం రాత్రి 9 అవుతోంది. రోజూలాగే, కొద్దిగా రద్దీగా ఉంది. లాయర్లు, క్లైంట్లతో సందడిగా ఉంది. చుట్టుపక్కల పోలీసులు హడావుడి ఉంది. ఇంతలో పోలీస్ వాహనం వచ్చి ఆగింది. అందులోంచి ఉపకార్ అనే వ్యక్తిని పోలీసులు కిందకు దించారు.

అతన్ని తీసుకెళ్తుంటే, ఆ వ్యక్తి  నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఫేస్ పెట్టాడు. అతనిపై ఓ కేసు నమోదైంది. దాని విచారణలో భాగంగానే అతన్ని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. సరిగ్గా అతన్ని కోర్టు ప్రాంగణం నుంచి లోపలికి తీసుకెళ్లబోతున్న సమయంలో   ఆ ప్రాంగణంలో లాయర్ అరుణ్ శర్మ చాంబర్ 444 దగ్గరకు రాగానే  ఒక్కసారిగా బుల్లెట్ల సౌండ్. ఫైరింగ్ శబ్దం వినపడగానే  లాయర్లు, క్లైంట్లూ అందరూ తలోదిక్కుకూ పరుగులు పెట్టారు. పోలీసులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. చాంబర్ దగ్గరున్న ఉపకార్‌ వైపు బుల్లెట్లు దూసుకొచ్చాయి. అవి అతను శరీరంలోకి చొచ్చుకెళ్లాయి. రక్తం ప్రవాహంలా బయటకు తన్నుకొచ్చింది. ఉపకార్  అక్కడికక్కడే కుప్పకూలాడు.

ఆ తర్వాత పోలీసులు  కాల్పులు ఎటు నుంచి వస్తున్నాయో చూశారు. అక్కడ ఎవరూ లేరు. ఈలోపే ఉపకార్ చనిపోయాడని తేలింది. అసలు కాల్పులు జరిపింది ఎవరు అనేది తెలుసుకోవడానికి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అతనో లాయర్ అని గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చాలా మంది లాయర్లు, ఉగ్రవాదులు ఫైరింగ్ చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ, ఓ లాయర్ ఇలా చేశారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసు విచారణకు హాజరయ్యేందుకు ఉపకార్ కోర్టుకు వచ్చినట్టు తెలిసింది. కాగా కాల్పులు జరిపిన వ్యక్తిని ఓ లాయర్ గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News