కర్నూలుకు తొలి ఫ్లైట్ లో రేర్ కాంబినేషన్

Update: 2021-03-29 05:30 GMT
ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కర్నూలు విమానాశ్రయం ఎట్టకేలకు ప్రారంభమైంది. ఆదివారం తొలిసారి ప్రయాణికులతో వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. విమానాల రాకపోకలతో కర్నూలు విమానాశ్రయంలో పండుగ వాతావరణం నెలకొంది. బెంగళూరు నుంచి తొలి విమానం కర్నూలు విమానాశ్రయానికి ఉదయం 10.10 గంటలకు చేరకుంది. 72 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి కర్నూలుకు వచ్చింది.

కర్నూలు ఎయిర్ పోర్టుకు ల్యాండ్ అయిన తొలి విమానం బెంగళూరు నుంచి రాగా.. టేకాఫ్ అయిన తొలి విమానం విశాఖకు కావటం గమనార్హం. కర్నూలు ఎయిర్ పోర్టులో తొలిసారి ల్యాండ్ అయిన విమానంలో  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ప్రయాణించటం విశేషం. తొలిసారి ల్యాండ్ అయిన విమానానికి రెండు ఫైర్ ఇంజిన్లతో వాటర్ చిమ్మి రాయల్ వెల్ కం చెప్పారు.

అంతేనా.. జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు.. జిల్లా అధికారులు విమానాశ్రయానికి వచ్చి ప్రయాణికులకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఫైట్ దిగిన తొలి ప్రయాణికురాలూన బెంగళూరు నివాసి రాంప్రసాద్ దంపతుల కుమార్తె సాయి ప్రతీక్షకు పుష్పగుచ్చాన్ని అందజేశారు.  మరో ఆసక్తికకరమైన విషయం ఏమంటే.. బెంగళూరు నుంచి కర్నూలు ఎయిర్ పోర్టుకు వచ్చిన తొలి విమానానికి పైలెట్ గా వ్యవహరించింది జిల్లాకు చెందిన వ్యక్తే కావటం రేర్ కాంబినేషన్ గా చెప్పాలి. ఈ ప్లైట్ పైలెట్ గా ఉన్న వీరా కర్నూలు నివాసి కావటం గమనార్హం. సొంతూరుకు విమానాన్ని నడిపే భాగ్యం తనకు లభించినట్లు ఆయన పేర్కొన్నారు.

కర్నూలు నుంచి టేకాఫ్ అయిన తొలి విమానం విశాఖకు వెళ్లింది. 66 మంది ప్రయాణికులతో ఇండిగో యాజమాన్యం ఫ్లైట్ ను నడిపింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు జిల్లాకు తలమానికమైన పుల్లారెడ్డి స్వీట్లు.. పోస్టల్ స్టాంపు ప్రత్యేక కవర్లను ప్రయాణికులకు అందజేశారు. మొత్తంగా కర్నూలు ఎయిర్ పోర్ట్ తొలి రోజు ఆసక్తికరంగా.. సందడి వాతావరణం చోటు చేసుకుంది.
Tags:    

Similar News