ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారి ఈ ఘట్టం

Update: 2020-06-15 06:50 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం కుదిరింది. ఈనెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు.  కేవలం రెండు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం.. ఆమోదించడం అన్నీ జరిగిపోవాలి.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం కేవలం రెండు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ముగిస్తోంది. మార్చిలోనే జరగాల్సిన బడ్జెట్ సమావేశఆలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

అసెంబ్లీ సంప్రదాయాలనే కరోనా మార్చేసింది. పాత సంప్రదాయాలకు భిన్నంగా అసాధారణ రీతిలో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా ఒకేరోజు గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమర్పణ ఉండనుంది.  16,17వ తేదీల్లో రెండు రోజుల్లోనే ఇదంతా పూర్తికానుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేసిన రోజునే రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెడుతారు. రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఉమ్మడి ఏపీలో విడిపోయిన తర్వాత ఇలాంటి అసాధారణ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 16న  రాష్ట్ర శాసనసభ, మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభిస్తారు.

గవర్నర్ ఆన్ లైన్ ద్వారా రాజ్ భవన్ నుంచే అసెంబ్లీలో టీవీలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఉద్దేశించి గంటసేపు ప్రసంగిస్తారు. ప్రసంగం ముగియగానే సంయుక్త సమావేశం ముగుస్తుంది. ఉభయ సభలు విడివిడిగా సమావేశమవుతాయి.

గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం ముగిసిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెడుతారు. వెంట వెంటనే చర్చ ప్రారంభ మై  బడ్జెట్ ఆమోదిస్తారు.  పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదిస్తారు.  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆరు నెలలలోపు అసెంబ్లీ, కౌన్సిల్ తప్పనిసరిగా సమావేశాలు జరపాల్సి ఉండడంతో ముందుగానే ఈ సమావేశాల నిర్వహణకు పూనుకున్నారు.
Tags:    

Similar News