ఎట్టకేలకు గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్

Update: 2021-04-21 14:39 GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  14 వ ఎడిషన్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా మూడు ఓటముల తర్వాత  పంజాబ్ కింగ్స్‌తో తలపడి మొట్టమొదటి విజయాన్ని అందుకుంది.

 టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే  పంజాబ్ కు మంచి ఆరంభం దక్కలేదు. కెప్టెన్ రాహుల్‌ను భువనేశ్వర్ కుమార్ మొదట్లోనే అవుట్ చేసి గట్టిదెబ్బ తీశాడు.  ఆపై వికెట్లు ఒకదాని తరువాత ఒకటి పడిపోయాయి. సన్ రైజర్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్ అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ను కట్టిపడేశారు.

తక్కువ లక్ష్యాన్ని కాచుకొని  సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్లోగా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ -జానీ బెయిర్‌స్టో ఓపెనర్లుగా వచ్చి పంజాబ్ బౌలర్లను కాచుకొని వికెట్లు పడకుండా విజయం దిశగా నడిపించారు. డేవిడ్  వార్నర్ 37 పరుగుల వద్ద అవుటయ్యాడు, కానీ బెయిర్‌స్టో చివరిదాకా ఉండి ఇన్నింగ్స్‌ను స్థిరంగా ముందుకు నడిపించాడు. అర్ధ సెంచరీ చేసి అజేయంగా చివరి వరకు క్రీజులో ఉండి సన్ రైజర్స్ కు విజయాన్ని అందించాడు.

చివరికి సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి  తొలి విజయాన్ని సాధించింది. ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించడానికి సన్ రైజర్స్ కు ఇంకా  మరో పది మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Tags:    

Similar News