బాబుకు షాకివ్వ‌నున్న ఆ ఐదుగురు ఎంపీలు!

Update: 2019-06-20 04:43 GMT
నీవు నేర్పిన విద్యే నీర‌జాక్ష అన్న చందంగా ఫిరాయింపుల్ని ప్రోత్స‌హించే టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు.. ఆయ‌నకు అత్యంత సన్నిహితులే తాజాగా షాకివ్వ‌నున్నారా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. ఏపీలో దారుణం ప‌రాజ‌యం త‌ర్వాత ఢిల్లీ వేదిక‌గా సాగుతున్న ఏపీ రాజ‌కీయాల‌కు సంబంధించి కొన్ని కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయి. బాబుకు షాకిచ్చేందుకు బీజేపీ సిద్ధ‌మైన‌ట్లుగా తెలుస్తోంది.

ఎన్నిక‌ల వేళ‌లో మోడీ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించి బాబుకు గుణ‌పాఠం చెప్పాల‌న్న యోచ‌న‌లో బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో బాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న న‌లుగురు రాజ్య‌స‌భ సభ్యులు తిరుగుబాటు చేసి.. జెండా మార్చేసేందుకు వీలుగా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. 

ఇప్ప‌టికే అధినేత తీరు మీద అసంతృప్తిని ప్ర‌ద‌ర్శిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పెట్టిన పోస్టులు ఎంత‌లా రాజ‌కీయ క‌ల‌క‌లాన్ని సృష్టించిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు బాబుపై తిరుగుబాటుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఏపీలో త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయిన ప‌లువురు ఎంపీలు తిరుగుబాటుకు సిద్ధ‌మయ్యార‌ని.. ఇందుకు సంబంధించిన స‌న్నాహాలు ఇప్ప‌టికే ఢిల్లీలో షురూ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

గ‌డిచిన కొద్ది రోజులుగా బీజేపీ అధినాయ‌క‌త్వం ట‌చ్ లోకి వెళ్లిన టీడీపీ నేత‌లు క‌మ్ రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నాచౌద‌రి.. సీఎం ర‌మేశ్‌.. టీజీ వెంక‌టేశ్.. గ‌రిక‌పాటి మోహ‌న‌రావు.. తోట సీతారామ‌ల‌క్ష్మీలు త్వ‌ర‌లోనే పార్టీ మారనున్న‌ట్లుగా చెబుతున్నారు. రాం మాధ‌వ్.. కిష‌న్ రెడ్డిలు క‌లిసి టీడీపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని.. పార్టీ మారే విష‌యంలో వారు అంగీక‌రించిన‌ట్లుగా స‌మాచారం.

టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ర‌వీంద్ర‌కుమార్ త‌ప్పించి మిగిలిన నేత‌లంతా బీజేపీలో మూకుమ్మ‌డిగా చేరాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు తెర వెనుక జ‌రిగిపోయాయ‌ని.. తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసే డేట్ ఫిక్స్ చేయ‌టం మాత్ర‌మే మిగిలి ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఐదుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌టానికి ప్ర‌ధాన కార‌ణాలు చూస్తే.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో బాబు ఓట‌మి.. ప్ర‌జారంజ‌క పాల‌న అందిస్తూ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న జ‌గ‌న్ ను ఇప్ప‌ట్లో రాజ‌కీయంగా దెబ్బ తీయ‌లేమ‌న్న నిర్ణ‌యం ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు.

దీనికి తోడు ప్ర‌ధాని మోడీతో సున్నం పెట్టుకోవ‌టం ద్వారా బాబు భారీ త‌ప్పు చేశార‌ని.. ఆయ‌న చేసిన త‌ప్పుల‌కు తాము ఎందుకు మూల్యం చెల్లించాల‌న్న మాట కూడా తెలుగు త‌మ్ముళ్ల నోటి నుంచి వినిపిస్తోంది. బాబుకు వ‌యోభారం పెరిగిన నేప‌థ్యంలో.. టీడీపీ వెంట న‌డిచే క‌న్నా.. వీడిపోవట‌మే ఉత్త‌మ‌మ‌న్న ఆలోచ‌న‌లో వారున్న‌ట్లుగా చెబుతున్నారు. తన‌కెంతో న‌మ్మ‌క‌స్తులుగా చెప్పే నేత‌లే బాబుపై తిరుగుబాటుబావుటా ఎగుర‌వేసి పార్టీ నుంచి వీడిపోతే.. టీడీపీ పెను సంక్షోభంలో ప‌డ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News