చిన్నమ్మను ఫ్లెక్సీలతో ప్రశ్నిస్తున్నారు!

Update: 2016-12-21 06:19 GMT
అన్నాడీఎంకే అధినేత్రి - అమ్మ జయలలిత మరణానంతరం నెచ్చెలి శశికళ చుట్టూ తిరగడం మొదలయ్యాయి తమిళనాడు రాజకీయాలు. అప్పటికప్పుడు పన్నీర్ సెల్వం ను ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ మరోవర్గం మాత్రం శశికళ చుట్టూ తిరుగుతుంది. అయితే నిన్నమొన్నటివరకూ పార్టీ అధ్యక్షురాలి హోదాను మాత్రమే ఆమెకు అప్పగించాలని భావించిన కొందరు సీనియర్లు... లేటెస్టుగా ఆమెను సీఎం చేయాలని, ఆ కుర్చీని ఆమె అధిరోహించాలని తెగ ప్రాదేయపడిపోతున్నారు. దీనికోసం జయలలిత ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజకవర్గంలో పోటీ చెయ్యమని రిక్వస్టులు మీద రిక్వస్టులు చేసేస్తున్నారు. వారి ఆతృత అలా ఉంటే, తాజాగా ఆ నియోజకవర్గంలో శశికళ అండ్ కో కు అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద షాకే ఇచ్చారు.

త్వరలో ముఖ్యమంత్రిగా శశికళ అనే కథనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడూ శశికళకు వ్యతిరేకంగా ఆర్ కే నగర్ లో ఫ్లెక్సీలు - బ్యానర్లు వెలిశాయి. ఈ ఫ్లెక్సీల్లో... "చిన్నమ్మ.. మీరు ఇంత వరకు చేసింది చాలు - దయచేసి ఇక్కడి నుంచి పోటీ చెయ్యవద్దు" అని పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇలా శశికళకు వ్యతిరేకంగా ఆర్ కే నగర్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు - బ్యానర్లు ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. ఇంకా ఈ ఫ్లెక్సీల్లో కొన్ని ప్రశ్నలను కూడా సంధించారు. వాటిలో ప్రధానంగా ఆకర్షిస్తుంది, హాట్ టాపిక్ అయ్యింది మాత్రం... "జయలలిత రాజకీయ వారసురాలిగా డబ్బు - హోదాను ఆశిస్తున్న శశికళకు.. అమ్మ మరణంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని లేదా" అనే ప్రశ్న అనే చెప్పాలి. దీంతో పాటు.. "ఆర్ కే నగర్ తో పాటు తమిళనాడు ప్రజల ఆగ్రహానికి శశికళ గురికాక తప్పుదు" అనే వ్యాఖ్యలు ఆ ఫ్లెక్సీలపై ఉన్నాయి. అయితే ఈ విషయం గమనించిన చిన్నమ్మ అభిమానులు, కొందరు అన్నాడీఎంకే నాయకులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏది ఏమైనా... ఈ ఫ్లేక్సీల్లో ప్రశ్నించినట్టుగా అమ్మ మరణంపై వాస్తవాలను - రహస్యాలను ప్రజలకు తెలపాల్సిన కనీస బాధ్యత శశికళకు లేదా అనే ప్రశ్న పలువురిని ఆకర్షించడంతోపాటు ఆన్ లైన్ లోనూ హల్ చల్ చేస్తుందట!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News