తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. వరద హెచ్చరిక

Update: 2022-09-12 11:34 GMT
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ముంచుకొస్తోంది. వరద ముప్పు తీవ్రంగా ఉండడంతో గోదావరి నది ఒడ్డున ఉన్న జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. దీంతో అధికారులు, ప్రజలు అప్రమత్తమయ్యారు. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరిటెండెంట్ లను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కేసీఆర్ ఆదేశించారు.

తెలంగాణలో మూడు రోజులుగా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఎగువ నదీతీర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 9 లక్షల క్యూసెక్కులకు చేరుతోందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. దీంతో సచివాలయంలో వెంటనే కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం గోదావరి అంతటా ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు 35 గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదిలారు. శ్రీరాంసాగర్ నుంచి దాదాపు 2.06 లక్షల క్యూసెక్కుల వరద విడుదలవుతోంది.

ఇక మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి రిజర్వాయర్ 85 గేట్లను తెరిచి 6.7 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. మేడిగడ్డ వద్ద 8.2 లక్షల క్యూసెక్కుల వరద విడుదల అవుతోంది.

గడిచిన రెండు నెలల్లో గోదావరికి వరదలు రావడం ఇది రెండోసారి. జులైలో సంభవించిన అపూర్వమైన వరదల కారనంగా పంటలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.

గడిచిన నాలుగు రోజులుగా తెలంగాణలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆళ్లపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 35.1 సెంటీమీటర్ల వర్షపాత నమోదైంది.  అధికారుల లెక్కల ప్రకారం.. 115 ఏళ్లలో ఇది మూడో అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం.  గతంలో 1983 అక్టోబర్ 6న నిజామాబాద్ లో అత్యధికంగా 35.5 సెం.మీల వర్షం కురిసింది. ఇక సిద్దిపేట జిల్లా కోహెడలో 1996లో 67.5 సెం.మీల వర్షం కురిసింది.

ఈ భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. కొన్ని పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. కొన్ని జిల్లాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో గ్రామాలు తెగిపోయాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. రోడ్డు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. మంచిర్యాల జిల్లాలో 23వ జాతీయ రహదారి పొంగి ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లాలో కారుపై చెట్టు కూలి ఇద్దరు మృతిచెందగా..ఒకరు గాయపడ్డారు. ఇలా భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికీ వాన తగ్గినా.. వరద తీవ్రత మాత్రం తగ్గడం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News