టాయిలెట్ డోర్ అనుకొని..ఎమ‌ర్జెన్సీ డోర్ ఓపెన్..!

Update: 2018-09-25 09:26 GMT
తొలిసారి విమానం ఎక్కేట‌పుడు చాలామంది కొంత ఉద్విగ్న‌త‌కు లోన‌వ‌డం స‌హ‌జం. తెలియ‌ని విష‌యాలను విమాన సిబ్బందిని అడిగి తెలుసుకోవ‌డం సాధార‌ణం. కానీ, ఓ భారత్ కు చెందిన ఓ ప్ర‌యాణికుడు మాత్రం తొలిసారిగా విమాన‌యానం చేస్తున్నాడ‌న్న టెన్ష‌న్ క‌న‌బ‌డ‌కుండా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేశాడు. ఎంచ‌క్కా సీటు బెల్టు పెట్టుకొని ద‌ర్జాగా అనుభ‌వ‌మున్న ప్ర‌యాణికుడిలా బిల్డప్ ఇచ్చాడు. ఆయ‌న‌గారిని చూసిన విమాన సిబ్బంది కూడా ఈ వెట‌ర‌న్ ప్ర‌యాణికుడిని కొత్త‌వాడ‌ని గుర్తించ‌లేదు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఈ బిల్డ‌ప్ బాబుకు హ‌ఠాత్తుగా ప్ర‌కృతి పిలుపు వ‌చ్చింది. స‌డెన్ గా టాయిలెట్ కు వెళ్లాల్సి రావ‌డంతో కాలుగాలిని పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. కానీ, ఇంత‌లో ఈ కోత‌ల రాయుడికి విమానం ఎమ‌ర్జెన్సీ డోర్ క‌నిపించింది. వెత‌క‌బోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్లు....టాయిలెట్ డోర్ క‌నిపించింద‌నుకొని....దానిని ఓపెన్ చేయాల‌ని ప్ర‌య‌త్నించాడు.

కానీ, ఆ డోర్ ఎంత‌సేప‌టికి తెరుచుకోవ‌డం లేదు. ఈ త‌తంగం అంతా గ‌మ‌నించిన స‌హ ప్ర‌యాణికులు ...అత‌డిని వారించారు. డోర్ తెర‌వ‌ద్దంటూ కేక‌లు పెట్టారు. అయినా విన‌కుండా....వారిని తోసి వేసి మ‌రీ డోర్ తెరిచేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో కొంత‌మంది ప్ర‌యాణికుల‌కు గాయాలు కూడా అయ్యాయి. చివ‌ర‌కు విమాన సిబ్బంది గురువుగారికి అస‌లు విష‌యం చెప్పి..టాయిలెట్ కు దారి చూపించ‌డంతో క‌థ సుఖాంత‌మైంది. అప్ప‌టివ‌ర‌కు తెగ బిల్డ‌ప్ ఇచ్చిన ఈ బాబు....త‌ప్పులో కాలేశాన‌ని గ్ర‌హించి త‌`లూ`పుకుంటూ `లూ`కు వెళ్లాడు. ఒక వేళ ఈ ఘ‌టికుడు...కాస్త గ‌ట్టిగా ఆ ఫ్ల‌యిట్ మెయిన్ డోర్ తెర‌చి ఉంటే....ఆ విమానం ప‌రిస్థితి ఏమై ఉండేదోన‌ని విమాన సిబ్బంది, ప్ర‌యాణికులు భ‌య‌భ్రాంతుల‌కు గుర‌య్యారు. తొలిసారి విమానం ఎక్కి నానా హంగామా చేసి...కొంద‌రిని గాయ‌ప‌రిచిన ఆ వ్య‌క్తిని ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేష‌న్ లో అప్ప‌గించారు. అయితే, అత‌డు తొలిసారి విమానం ఎక్కాడ‌ని, తెలియ‌క ఆ విధంగా ప్ర‌య‌త్నించాన‌ని అత‌డు పోలీసుల‌కు వివ‌ర‌ణ ఇచ్చాడు. గో ఎయిర్ కు చెందిన‌ ఢిల్లీ - పాట్నా జీ8 149 విమానంలో సోమ‌వారం నాడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది.


Tags:    

Similar News