దాణా కుంభ‌కోణ‌లో అస‌లు ఏం జ‌రిగింది

Update: 2017-12-23 15:30 GMT
ఆర్జేడీ అధినేత - బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్ యాద‌వ్‌ ను జైలు బాట ప‌ట్టించేందుకు కార‌ణ‌మైన దాణా కుంభ‌కోణం విష‌యంలో తీర్పు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ కుంభ‌కోణం అస‌లు క‌థ ఏంట‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్న అంశం. ఈ కుంభ‌కోణం వివ‌రాలు ఇవి...బీహార్‌ లో దాణా కోసం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. ఆ మొత్తాన్ని అక్రమంగా ప్రభుత్వ ఖజానా నుంచి విత్‌ డ్రా చేసుకున్నారు. పశు సంవర్థకశాఖ పేరుతో ఆ మొత్తం సొమ్మును కాజేశారు. వివిధ జిల్లాల నుంచి ఆ అమౌంట్‌ ను విత్ డ్రా చేశారు. రెండు దశాబ్ధాల పాటు లాలూ సీఎంగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం జరిగింది. దాణా సరఫరా చేస్తున్నారని లేని కంపెనీలను సృష్టించి.. వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారు.

1997, అక్టోబర్ 27న దాణా కేసులో మొత్తం 38 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో ఇప్పటికే 11 మంది చనిపోయారు. మరో ముగ్గురు అప్రూవర్లుగా మారారు. మరో ఇద్దరిని దోషులుగా తేల్చారు. అయితే ఇవాళ దాణా కుంభకోణంకు సంబంధించిన డియోఘర్ ట్రెజరీ కేసులో తీర్పును వెల్లడించారు. 1991 నుంచి 1994 మధ్య ఆ ట్రెజరీ నుంచి పశుదాణా కోసం రూ.89 లక్షల విత్‌ డ్రా చేశారు. దాణా కేసులో ఇప్పటివరకు వేర్వేరు కోర్టుల్లో 500 మందిని దోషులుగా తేల్చారు. అందులో లాలూ కూడా ఒకరు. చైబాసా ట్రెజరీ కేసులో ఆయన్ను దోషిగా తేల్చారు. 2013 - అక్టోబర్ 3న ఆ కేసులో కోర్టు లాలూకు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఆయన లోక్‌ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ లాలూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అది ఇప్పుడు పెండింగ్‌లో ఉంది.

తీర్పు సందర్భంగా ఇవాళ రాంచీలోని సీబీఐ కోర్టు ఆవరణకు భారీ సంఖ్యలో జనం చేరుకున్నారు. లాలూతో పాటు బీహార్ మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా - మరో 20 మంది కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. సీబీఐ స్పెషల్ జడ్జి శివపాల్ సింగ్ ఈ కేసులో తీర్పును వెల్ల‌డించారు. దాణా కుంభకోణం కేసులో  లాలును దోషిగా తేల్చింది. దాణా కుంభకోణంకు సంబంధించిన డియోగర్ ట్రెజరీ కేసులో లాలును దోషిగా పేర్కొంటూ రాంచీ సీబీఐ కోర్టు నేడు తీర్పును వెల్లడించింది.

కాగా  రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లడం ఇది తొమ్మిదవసారి. నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో లాలు వివిధ కేసుల్లో జైలుకు వెళ్లివస్తున్నారు. ఒక్క దాణా కుంభకోణానికి సంబంధించిన కేసుల్లోనే ఐదుసార్లు జైలుకు వెళ్లారు. రాంచీలోని బిర్సా ముందా సెంట్రల్ జైలుకు వెళ్లడం ఈ 69 ఏళ్ల రాజకీయ కురువృద్ధుడికి ఇది మూడోసారి.
Tags:    

Similar News