అగ్రరాజ్యంలో ఆకలి కేకలు..ఆహారం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలు!

Update: 2020-04-20 08:30 GMT
ప్రపంచానికే పెద్దన్న. ఎవరినైనా కనుసన్నలతో కంట్రోల్ చేసే సామర్థ్యం ఉన్న అమెరికాలో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తే షాక్ తినాల్సిందే. సంపన్న దేశంగా.. దేనినైనా సరే సొంతం చేసుకునే సత్తా ఉన్న దేశంగా.. తమ మాట వినని దేశం ఆగమాగం అయ్యే పవర్ తమకు మాత్రమే సొంతమని చెప్పుకునే దేశంలోని ప్రజలు ఆకలితో కేకలు పెడుతున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అమెరికాలో అమెరికన్లు చాలామంది పెద్దగా పట్టించుకోని ఫుడ్ బ్యాంకుల వద్ద ప్రభుత్వం పెట్టే ఆహారం కోసం బారులు తీరిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కరోనా కారణంగా రాత్రికి రాత్రే లక్షలాది మందికి ఉద్యోగాలు పోవటం.. రోడ్డున పడిన వారి చేతుల్లో డబ్బులు లేకపోవటంతో వారికేం చేయాలో తోచని పరిస్థితి. మనకు మాదిరి ఉద్యోగం పోయిందంటే.. అంతో ఇంతో కష్టంతో బతికేయొచ్చు. కానీ.. అమెరికన్లు అలా కాదు. సంపాదించినదంతా దాదాపుగా ఖర్చు చేసే అలవాటు ఎక్కువ. దీంతో.. కరోనా లాంటి ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు ఆకలితో ఇబ్బందులు పడకుండా బతకమే పెద్ద సమస్యగా మారుతుంది.

కరోనా దెబ్బకు ఆకలితో అలమటిస్తున్న అమెరికన్లు పలువురు.. నెల రోజుల రేషన్ కోసం అమెరికాలోని ఫుడ్ బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల కొద్ది ఉన్న ఈ ఫుడ్ బ్యాంకుల వద్ద గతంలో ఎప్పుడూ లేనంత రద్దీ నెలకొంది. పెన్సిల్వేనియా.. టెక్సాస్.. కాలిఫోర్నియాతో పాటు.. పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

ఇప్పటివరకూ అమెరికాలో 7.63లక్షల మంది కరోనా కోరలకు చిక్కుకున్నారు. ఆదివారం ఒక్కరోజులో అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారిసంఖ్య 1539 మంది కాగా.. కొత్తగా పాతికవేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 40,553 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. దాదాపు 71వేల మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశంలో లక్షలాది మంది ప్రజలు ఆకలితో ఆలమటిస్తున్న వైనం చూస్తే.. కరోనాతో ఆ దేశం ఎంతగా విలవిలలాడుతుందో ఇట్టే అర్థం కాక మానదు.
Tags:    

Similar News