అఫ్ఘాన్‌ లో అన్ని కోట్లమందికి తిండి దొరకదట !

Update: 2021-08-20 07:30 GMT
గత 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌ లోని కీలక పట్టణాలన్నింటినీ ఆక్రమించుకుంటూ వచ్చి కాబూల్‌ ను సైతం హస్తగతం చేసుకున్నారు. గడిచిన 20 ఏళ్లుగా అమెరికా, బ్రిటన్‌, నాటో సంకీర్ణ దళాల సహకారంతో పునర్నిర్మాణం. మూడు లక్షల సుశిక్షితులైన సైనిక సంపత్తి. అగ్రరాజ్యాలు ఇచ్చిన ఆయుధ సంపత్తి. రాష్ట్రాల వారీగా మోహరించే భద్రతా బలగాలు. పోలీసులు. వ్యూహాత్మక స్థానాలపై పట్టు సాధించే నైపుణ్యం. ఇదీ అఫ్ఘానిస్థాన్‌ బలం. మరి తాలిబన్ల బలమేంటి ,75 వేల మంది మిలిటెంట్లే, అయినా.. రోజుల వ్యవధిలో అఫ్ఘానిస్థాన్‌ పై తాలిబన్లు ఎలా పట్టు సాధించగలిగారు, అక్కడే ఉంది తాలిబన్ల రణనీతి. ఎదుటి వారిని ముందుగా హడలగొట్టడం, ఆ తర్వాత పట్టు సాధించడం తాలిబన్ల స్టైల్‌. పట్టు విడవకుండా, లక్ష్యాన్ని ఛేదించేదాకా నిద్రపోని మొండితనం, ఆ లక్షణాలే తాలిబన్లకు మళ్లీ అఫ్ఘాన్‌ లో అధికారాన్ని కట్టబెట్టాయి.

అమెరికా సేనలు అటు మొహం తిప్పగానే ఇటు తాలిబన్లు తలెగరేశారు. వారి ధాటికి తట్టుకోలేక అధ్యక్షుడు ఘనీ అధికారాన్ని తాలిబన్లకు అప్పగించారు. గతం లో తాలిబన్ల కారణంగా అటు అఫ్గాన్‌ లు, ఇటు ఇతర దేశాలు అనుభవించిన ఇబ్బందులు గుర్తొచ్చి ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. 1994లో ఆవిర్భవించిన తాలిబన్లు 1996 నాటికి అఫ్గానిస్తాన్‌ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వీరి పై 2001లో అమెరికా దాడులు జరిపి ఊచకోత కోసింది. అమెరికా అండతో పౌర ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు దశాబ్దాలు అమెరికా, మిత్రదేశాల రక్షణలో అఫ్గాన్‌ లో ప్రజాస్వామ్యం చిగుర్లు వేయడం ఆరంభించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన హమీద్‌ కర్జాయ్‌ అధ్యక్షుడయ్యారు. 2014లో అష్రాఫ్‌ ఘనీ అధ్యక్షుడిగా ఎన్నికై ఆదివారం దాకా పాలించారు. అమెరికా బలగాల ఉపసంహరణ చేపట్టడం అఫ్గాన్‌ కు అశనిపాతంగా మారింది.

ఇక ఇదిలా ఉంటే..ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కరోనా కారణంగా కకావికలమైన అఫ్ఘాన్, తాలిబన్ చేతులోకి వెళ్లడంతో మరింత అద్వానంగా తయారు కానుందని తెలిపింది. అధ్యక్షత ప్రభుత్వం పోవడంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుందని వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్స్‌కి చెందిన అఫ్ఘాన్ డైరెక్టర్‌ మేరి ఎలన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పంటల దిగుబడి తగ్గిందని, నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు నాశనమయ్యాయని తెలిపారు.

దేశం తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో చాలామంది నిరాశ్రయులవుతున్నారు. వారికి బయపడి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. బయట ఎక్కడ ఆహారం దొరకడం లేదని తెలిపారు. మే నెలలో 40 లక్షల మంది ఆకలిని తీర్చామని, వచ్చే కొద్ది నెలల్లో 90 లక్షల మంది కడుపు నింపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మేరి ఎలన్‌ తెలిపారు. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునైనా ఈ ఆకలి సంక్షోభాన్ని నివారించాలంటే, 20 కోట్ల అమెరికా డాలర్లు తక్షణావసరమని మేరి వివరించారు. ఇలాంటి పరిస్థితిల్లో అఫ్ఘాన్ కు అన్ని దేశాలు సాయం చేయాలనీ ఆమె కోరారు.


Tags:    

Similar News