ఖ‌ర్గేకు.. ఖ‌డ్గ స‌వాలే.. కాంగ్రెస్‌ను న‌డిపించ‌డం అంత ఈజీ కాదు..!!

Update: 2022-10-19 09:30 GMT
దేశంలో స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగానే ఉద్భ‌వించిన కాంగ్రెస్ పార్టీకి.. 137 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే.. సుదీర్ఘ కాలం పాటు.. ఈ పార్టీని న‌డిపించింది మాత్రం గాంధీల కుటుంబ‌మే. అయితే.. మ‌ధ్య‌లో కొంద‌రు ప‌గ్గాలు చేప‌ట్టారు. అయితే.. వారంతా అగ్ర‌ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. కానీ, తొలిసారి.. కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌లో .. ఒక ద‌ళిత నాయ‌కుడు.. సుమారు 55 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్న నేత‌.. క‌ర్ణాట‌కకు చెందిన 86 ఏళ్ల మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఘ‌న విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులోకి అనూహ్యంగా అడుగుపెట్టిన ఆ పార్టీ రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అనూహ్యంగా గాంధీ ల మ‌ద్ద‌తు సాధించి విజయం ద‌క్కించుకున్నారు.  ప్రత్యర్థి అయిన తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ, బీసీ వ‌ర్గానికి చెందిన(నాయ‌ర్‌) శశిథరూర్పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు థరూర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఓ కీలక బాధ్యతని.. దాన్ని సక్రమంగా నిర్వర్తించడంలో ఖర్గే సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

అయితే.. ఖ‌ర్గే విష‌యాన్ని తీసుకుంటే.. ఏకంగా.. 9 సార్లు ఆయ‌న అసెంబ్లీకి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతేకాదు.. క‌ర్ణాట‌క‌లో పార్టీని మాత్రం ముందుండి న‌డిపించారు. అధ్యక్ష ఎన్నికకు అక్టోబరు 17న పోలింగ్‌ చేపట్టగా.. దేశవ్యాప్తంగా దాదాపు 9,500 మంది (96శాతం మంది) పార్టీ ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని రాష్ట్రాల్లోని బ్యాలెట్ బాక్సులను ఢిల్లీకి తీసుకొచ్చి బుధవారం కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ఆధ్వర్యం లెక్కింపు చేపట్టారు.దీనిలో ఖ‌ర్గే విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక‌, ఆయ‌న ఎలా ముందుకు న‌డిపిస్తారో చూడాలి. అయితే.. ఖ‌ర్గే విజ‌యాన్ని ముందుగానే అంద‌రూ ఊహించారు. గాంధీలు అండ‌గా ఉండ‌డం.. అస‌మ్మ‌తి నేత‌లు సైతం.. ఆయ‌న‌కు జై కొట్ట‌డం గ‌మ‌నార్హం.

ఎవ‌రికి ఎన్ని ఓట్లు...

    మొత్తం పోలైన ఓట్లు : 9500+
    ఖర్గేకు వచ్చిన ఓట్లు: 7897
    థరూర్కు వచ్చిన ఓట్లు: 1072

ద‌ళిత నాయ‌కుడు.. మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. ప్రాచీన పార్టీ అయిన‌.. కాంగ్రెస్‌కుఅధ్య‌క్షుడిగా భారీ మెజారిటీతోవిజ‌యం ద‌క్కించుకున్నార‌నేది ఒక్క‌టే సంతోషం. కానీ, ఆయ‌న ఐదేళ్ల పాటు పార్టీని న‌డిపించాల్సి ఉంది. ఈ ఐదేళ్ల‌లో ఆయ‌న‌కు అనేక స‌వాళ్లు ఎదురు కానున్నాయి. అస‌లు ఇప్పుడు ఉన్న‌దే స‌వాళ్ల ప్ర‌పంచ‌మ‌ని .. కొంద‌రు అంటున్నారు. దీనిని దాటుకుని..  పార్టీని 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో ప్ర‌ధాని పీఠం వ‌ర‌కు తీసుకువెళ్ల‌గ‌ల‌రా.. ? అత్యంత‌కీల‌క‌మైన అసంతృప్త వాదులు.. గ్రూప్‌-23(జీ-23) నేత‌ల‌ను ఆయ‌న సంతృప్తి ప‌ర‌చ‌గ‌ల‌రా? అనేది.. ఇప్పుడున్న స‌వాల్‌.

వీటికిమించి.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎత్తులు.. బీజేపీ.. ఆర్ ఎస్ఎ స్‌ల పై ఎత్తుల‌ను అధిగ‌మించ‌డం.. 86 ఏళ్ల ఖ‌ర్గేకు అంత ఈజీ అయితే.. కాద‌నేది విశ్లేష‌కుల మాట‌. 2014 తర్వాత క్రమక్రమంగా బలహీనపడిన కాంగ్రెస్ను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిలపడింది. ఏ ఎన్నికల్లోనూ పెద్దగా రాణించడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంతో లోక్సభలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ తదుపరి అధ్యక్షుడికి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. వాటిని ఖర్గే ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

ప్ర‌ధాన స‌మ‌స్య‌లు.. ఇవీ..

+    దేశవ్యాప్తంగా పార్టీకి పునరుజ్జీవం పోయాలి
+   బలమైన ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కోవాలి
+    2024 లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
+   జీ23 నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి
+   త్వరలో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలి
+    ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ను కాపాడుకోవాలి
+    వచ్చే ఏడాదిన్నర కాలంలో 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ సత్తా చాటేలా పార్టీని నడిపించాలి
Tags:    

Similar News