పవర్ ఫుల్ దీదీ కోసం.. బెంగాల్ లో మండలి కొలువు తీరనుంది

Update: 2021-07-07 04:03 GMT
అధికారంలో ఉన్న వారు తమకు అవసరమైన వాటిని కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇలాంటి సీన్ ఎదురవుతోంది. గతంలో తమ వారి కొలువుల కోసం కొన్ని రాష్ట్రాలు శాసన మండలిని ఏర్పాటు చేయటం తెలిసిందే. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. సుదీర్ఘకాలం అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతల కోసం ఉమ్మడి ఏపీలో మండలిని కొలువు తీర్చేలా అప్పటి వైఎస్ సర్కారు చర్యలు తీసుకుంది. దీంతో.. ఎన్టీఆర్ హయాంలో రద్దు చేసిన మండలి ఏపీలో మరోసారి పురుడు పోసుకుంది.

రాష్ట్రాల్లో శాసన మండలిని ఏర్పాటు చేయాలన్న కచ్ఛితమైన రూల్ అంటూ ఏమీలేదు. రాష్ట్రాల విచక్షణకు అనుగుణంగా దాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంది. దీని మీద కేంద్రానికి పెద్దగా పట్టు ఉండదు. కాకుంటే.. అప్పటివరకు మండలి లేకుండా.. కొత్తగా శాసన మండలిని కొలువు తీర్చాలని ఆయా రాష్ట్రాలు కోరితే.. అందుకు ఓకే చెప్పాల్సింది మాత్రం కేంద్రం మీద ఉంటుంది. ఇంతకూ పశ్చిమబెంగాల్ లో శాసన మండలిని ఇప్పటికిప్పుడు అంత అర్జెంట్ గా ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారన్న విషయంలోకి వెళితే.. రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ కోసమేనని చెప్పక తప్పదు.

ఈ మధ్యన ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీగా బరిలోకి దిగిన దీదీ పార్టీ బంపర్ మెజార్టీతో విజయం సాధించటం తెలిసిందే. చాలామంది అంచనాలకు భిన్నంగా 200 మార్కుల సీట్లను సొంతం చేసుకున్న దీదీకి.. భారీ షాక్ ఏమంటే.. ఆమె స్వయంగా పోటీ చేసిన నందిగ్రామ్ లో ఒకనాటి తన శిష్యుడు సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో.. మోడీషాల పంతానికి భిన్నంగా బెంగాల్ కోటను మరోసారి సొంతం చేసుకున్నప్పటికి.. తాను ఓడిపోవటాన్ని ఆమె జీర్ణించుకోలేరని చెబుతారు. ఎమ్మెల్యే కానప్పటికీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టే సౌలభ్యం ఉండటంతో ఆమె మరోసారి బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు.

నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా ఎన్నిక కాని నేత ఎవరైనా ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయిన పక్షంలో.. పదవిని చేపట్టిన రోజు నుంచి ఆర్నెల్లు ముగిసే లోపు ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అలా కుదరని పక్షంలో.. ఎమ్మెల్సీగా అయినా కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో.. షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నికలు జరిగే వీల్లేదు. దీంతో.. ఎమ్మెల్సీగా ఎంపిక కావాల్సి ఉంటుంది. అయితే.. బెంగాల్ లో ఇప్పటివరకు శాసన మండలి అన్నదే లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా మండలిని ఏర్పాటు చేసేందుకు బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు.

మండలిని ఏర్పాటు చేయాలన్న తాజా తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. మమత కోరుకున్నట్లుగా బెంగాల్ లో మండలిని ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే.. ఇక్కడే ఒక ఆసక్తికర అంశం ఉంది. అదేమంటే.. ఒక రాష్ట్రంలో మండలిని ఏర్పాటు చేయాలంటే దానికి ఓకే చెప్పాల్సింది కేంద్రమే. ఒక రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిన సమయం నుంచి ఫలానా సమయం లోపు మండలిని ఏర్పాటు చేయాలన్న రూల్ లేదు.

దీంతో.. మమతకు చిరాకు తెప్పించేలా మండలి ఏర్పాటు ఫైల్ ను కేంద్రం కాని పక్కన పెట్టేస్తే.. ఆమె కోరుకున్నట్లుగా మండలి ఏర్పాటు కాదు. అదే జరిగితే.. ఆమె ఎమ్మెల్సీ కాలేరు. అదే జరిగితే.. ఆమె నిర్ణీత వ్యవధి తర్వాత తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా తప్పదు. ఇప్పటికే ఉప్పు.. నిప్పులా ఉండే మమత..మోడీల మధ్య రానున్న రోజుల్లో మండలి వ్యవహారంపై రాజకీయ రచ్చ చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇలాంటిదేమీ లేకుండా మమతకు ఇరిటేషన్ తెప్పించకుండా.. కేంద్రం బుద్ధిగా మండలి ఏర్పాటుకు ఓకే చెబితే.. మాత్రం అది అనూహ్యమే అవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News