ఆ కారణంతోనే ఎక్కువగా వైరస్ భారిన పడుతున్నారట ?

Update: 2020-05-15 23:30 GMT
రోజురోజుకి ఈ మహమ్మారి భారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది, ముఖ్యంగా కొంచెం ఎక్కువ వయస్సు ఉన్న వారు, దీర్ఘకాలికంగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో పోరాడుతోన్న వారు ఈ వైరస్ భారిన ఎక్కువగా పడుతున్నారు. తాజాగా దానికి గల కారణాలు వెల్లడైయ్యాయి. శరీరంలోని జన్యువుల కార్యకలాపాల నియంత్రణతో పాటు బయటి నుంచి ప్రవేశించే వైరస్‌ ఆర్‌ ఎన్ ‌ఏలపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషించే మైక్రో ఆర్‌ ఎన్‌ ఏల క్షీణత వల్లే వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది.  

వయసు పెరుగుదలతో పాటు, గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా శరీరంలోని మైక్రో ఆర్‌ ఎన్ ‌ఏల తగ్గుదలతో రోగ నిరోధకశక్తి తగ్గి పెద్ద వయసు వారు  కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువున్నట్లు వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా, అగస్టా యూనివర్సిటీ, ఇతర పరిశోధన సంస్థలు నిర్వహించిన ఈ అధ్యయనం ద జర్నల్‌ ఆఫ్‌ ఏజింగ్‌ అండ్‌ డిసీజ్‌ తాజా సంచికలో ప్రచురితమైంది.

మొత్తం 17 దేశాల నుంచి సేకరించిన సార్స్‌ సంబంధిత 4 శాంపిళ్లు, ప్రస్తుత వైరస్  కారక సార్స్‌ సీవోవీ2కు సంబంధించిన 29 నమూనాలపై ఈ మైక్రో ఆర్‌ ఎన్ ‌ఏలను ప్రయోగించారు. వీటిలో సార్స్‌ జీనోమ్ ‌ను 848 మైక్రో ఆర్‌ ఎన్ ‌ఏలు, సార్స్‌ సీవోవీ 2 జీనోమ్ ‌ను 873 మైక్రో ఆర్ ‌ఎన్ ‌ఏలు దాడి చేసినట్లు సైంటిస్ట్‌ లు వెల్లడించారు. మనుషుల్లోని ఈ మైక్రో ఆర్‌ ఎన్ ‌ఏలు దాడిచేసే వైరస్ ‌ల ఆర్‌ ఎన్ ‌ఏలను తెంపుతున్నట్లుగా, ఈ వైరస్‌ శరీరంలోని కణాల్లోకి ప్రవేశించినప్పుడు కూడా ఈ మైక్రో ఆర్ ‌ఎన్‌ ఏలు ముందుండి పోరాడుతున్నట్లు తేలిందన్నారు. అయితే వయసుతో పాటు దీర్ఘకాల అనారోగ్య సమస్యల కారణంగా  మైక్రో ఆర్‌ ఎన్‌ ఏల సంఖ్య క్షీణత వల్ల వైరస్‌ లపై స్పందించే శక్తి తగ్గిపోతున్నట్లు అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన కార్లోస్‌ తెలిపారు. దీనితో, ఎక్కువ వయస్సు ఉన్న వారి  శరీరంలోకి ఈ వైరస్  ప్రవేశించాక ప్రతిఘటన లేకపోవడంతో కణ యంత్రాంగాన్ని కైవశం చేసుకుని తన బలాన్ని పెంచుకుని ప్రధాన అవయవాలపై దాడి చేస్తున్నట్లు  తెలిసింది అని తెలిపారు.
Tags:    

Similar News