వైసీపీ నేత కూతురు కోసం.. మ‌రో అమ్మాయి బ‌లి!

Update: 2022-03-24 10:30 GMT
తాజాగా ఏపీలో చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన.. పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య ఘటనలో వైసీపీ నేత ఉన్నాడ‌నే విష‌యం వెలుగులోకి వచ్చింది. బాగా చదవడమే తనకు ఇబ్బందిగా మారిందంటూ.. మిస్బా రాసిన కన్నీటి లేఖ బయటపడింది.

తాను మొదటి ర్యాంకు సాధించడం తన తోటి విద్యార్థినికి ఇష్టం లేదంటూ ఆ లేఖలో పేర్కొంది. మిస్బా ప్రస్తావించిన విద్యార్థిని వైసీపీ నేత కుమార్తె కావడం సంచ‌ల‌నంగా మారింది. తన కుమార్తెకే మొదటి ర్యాంకు రావాలని వైసీపీ నేత ఒత్తిడి చేయడంతోనే... పాఠశాల యాజమాన్యం విద్యార్థిని మిస్బాను వేరే పాఠశాలకు టీసీ ఇచ్చి పంపింది.. దీంతో తీవ్ర మ‌న‌స్థాపం పెంచిన విద్యార్థిని మిస్సా.. ఆత్మ‌హ‌త్య చేసుకుంది.  

మూడు రోజుల క్రితం చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి విద్యార్థిని మిస్బా ఆత్మహత్య చేసుకుంది. అయితే.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వేధింపుల వల్లే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. కాగా.. ఆత్మహత్యకు ముందు మిస్బా రాసిన సూసైడ్ లెటర్ లోని కొత్త అంశాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

 "నాన్నా.. నన్ను క్షమించు.. నా కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావు.." అంటూ మిస్బా.. తన తండ్రి గురించి లేఖలో రాసింది. బాగా చదవడమే తనకు ఇబ్బందిగా మారిందని మిస్బా పేర్కొంది. తాను బాగా చదవడం వల్ల తోటి విద్యార్థిని బాధపడుతోందని.. ఆమె తనను అర్థం చేసుకోలేకపోయిందని లేఖలో రాసింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ మిస్బా... లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.

ప‌లమనేరులోని బ్రహ్మర్షి పాఠశాలలో చదువుతున్న మిస్బా.. మరో నెల రోజుల్లో పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. ఈ తరుణంలో మిస్బాకు టీసీ ఇచ్చి వేరే పాఠశాలకు పంపింది యాజమాన్యం. ఆ తర్వాత మూడు రోజులకే మిస్బా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఉరి వేసుకుని చనిపోవడంపై.. వివిధ రకాల వాదనలు వినిపించాయి.

అయితే.. తాజాగా బయటకు వచ్చిన మిస్బా రాసిన లేఖ ద్వారా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశాలు కేసును మలుపుతిప్పేలా ఉన్నాయి. తాను బాగా చదువుతున్నందున తోటి విద్యార్థిని బాధపడుతోందంటూ.. మిస్బా లేఖలో ప్రస్తావించిన అమ్మాయి.. వైసీపీ నేత కుమార్తె కావడం చర్చనీయాంశమైంది.

తన కుమార్తె కోసం ఆ నేత స్వయంగా మిస్బాను మరో పాఠశాలకు పంపించడం వల్లనే.. కలత చెంది ఆత్మహత్యకు పాల్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిస్బా రాసిన లేఖను తమకు చూపకుండా.. పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మిస్బా కుటుంబసభ్యులను పరామర్శించిన తెలుగుదేశం నేత అమర్నాథ్‌రెడ్డి.. బాలిక బలవన్మరణంపై వాస్తవాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News