మా ద‌గ్గ‌ర ఉగ్ర‌వాదులు ఉన్నారు.. అయితే?

Update: 2017-09-07 09:47 GMT
బ‌రితెగింపున‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా నిలిచిన పాకిస్తాన్ త‌న మొండి త‌నాన్ని ఎలా ప్ర‌ద‌ర్శిస్తుంద‌నేందుకు మ‌రో నిద‌ర్శ‌నం ఇది. ఇప్ప‌టికే ఉగ్ర‌దేశంగా ముద్ర ప‌డి ప్ర‌పంచ దేశాల ముందు ఎన్ని అవ‌మానాల‌కు గురైనా పాక్ తీరు మాత్రం మార‌డం లేదు. మొన్న‌టికి మొన్న త‌న మిత్రప‌క్ష‌మైన‌ చైనా కూడా స‌భ్య దేశంగా ఉన్న బ్రిక్స్ కూడా పాక్‌ ను ఉగ్ర‌దేశంగా అభివ‌ర్ణించిన విష‌యం తెలిసిందే. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో తొలిసారి త‌మ ద‌గ్గ‌ర నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌లు ల‌ష్క‌రే తోయిబా - జైషే మ‌హ్మ‌ద్ ఉన్న‌ట్లు ఆ దేశం అంగీక‌రించింది. అయితే ఈ సంద‌ర్భంగా చిత్ర‌మైన వాద‌న చేసింది.

పాక్ విదేశాంగ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ ఆ దేశానికి చెందిన జియో న్యూస్ చానెల్‌ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తమ దేశంలో ఉగ్ర‌వాదులు ఉన్న విష‌యాన్ని నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. ``అవును అందులో ఆశ్చ‌ర్యం ఏముంది? మ‌న ద‌గ్గ‌ర ఈ నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌లు ఉన్నాయి`` అని ఆయ‌న చాలా సింపుల్‌ గా చెప్పేయ‌డం గ‌మ‌నార్హం. గ‌త మూడేళ్ల నుంచి ఆ సంస్థ ఆట క‌ట్టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు కూడా ఈ సంద‌ర్భంగా ఆసిఫ్ వెల్ల‌డించారు. అంతేకాదు బ్రిక్స్ ఆందోళ‌న‌లు చైనావి కావ‌ని కూడా ఆయ‌న చెప్ప‌డం విశేషం. అయితే ఈ నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌ల‌పై ఏవైనా చ‌ర్య‌లు తీసుకుంటేనే అంత‌ర్జాతీయ స‌మాజంలో మ‌న‌కు ఏమైనా ప‌రువు ఉంటుంది అని ఈ ఇంట‌ర్వ్యూలో ఆసిఫ్ అన్నారు. ``ప్ర‌పంచ‌మంతా మ‌ననే నిందిస్తోంది. మ‌న ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల్సిందే`` అని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ``ఇలాంటి సంస్థ‌ల‌ను ప‌ట్టించుకోనంత వ‌ర‌కు అంత‌ర్జాతీయ స‌మాజం నుంచి మ‌న‌కు అవ‌మానాలు త‌ప్ప‌వు`` అని కూడా ఆసిఫ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌త 40 ఏళ్లుగా పాక్ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉంద‌ని కూడా ఈ సంద‌ర్భంగా ఆయ‌న అంగీక‌రించారు. ఉగ్ర‌వాదంతో పాకిస్థాన్‌ కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌పంచానికి చెప్పాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని ఆసిఫ్ అన్నారు.

కాగా, బ్రిక్స్ కూటమి మొట్టమొదటిసారిగా పాకిస్థాన్ స్థావరంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల చిట్టావిప్పింది. ప్రాంతీయంగా అవి సృష్టిస్తున్న హింసాకాండను వేలెత్తి చూపింది. లష్కరే తాయిబా - జైషేమహ్మద్ వంటి సంస్థలను నేరుగా ప్రస్తావించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని - వారి నిర్వాహకులను లేదా సమర్థకులను చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టంచేసింది. పాక్ స్థావరంగా పనిచేస్తున్న ముఠాల ఉగ్రవాద కార్యకలాపాలను బ్రిక్స్ సభ్యదేశాలైన భారత్ - చైనా - రష్యా - బ్రెజిల్ - దక్షిణాఫ్రికాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రధాని నరేంద్రమోడీకి ఇది దౌత్యపరంగా ఘనవిజయమని పరిశీలకులు అంటున్నారు. సమిష్టిగా ఉగ్రవాద బెడదను ఎదుర్కోవాలని బ్రిక్స్ దేశాధినేతలు ప్లీనరీ చివరన షియామెన్ డిక్లరేషన్ పేరిట సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ లో అన్నివర్గాలు హింసకు తక్షణమే స్వస్తిచెప్పాలని ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.
Tags:    

Similar News