అధికారికం; వీడియో టేపులు ఒరిజినల్‌

Update: 2015-06-25 04:43 GMT
ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్‌ ఫిక్స్‌ అయినట్లే. ఇప్పటివరకూ టీటీడీపీ చేస్తున్న విమర్శలకు చెక్‌ చెబుతూ.. శాస్త్రీయంగా వీడియో టేపుల్ని విశ్లేషించారు ఎలాంటి అతుకులు చేర్చలేదని.. ఓటుకు నోటు వ్యవహారంలో బయటకు వచ్చిన వీడియో టేపులు ఒరిజినల్‌ అని తేల్చారు.

అందులోని దృశ్యాలుఎలాంటి మార్పులు చేర్పులు చేయటం కానీ.. కట్‌ పేస్ట్‌లాంటివి లేవన్నది తేల్చారు. దీనికి సంబంధించిన ప్రాధమిక నివేదికను ఏసీబీ న్యాయస్థానానికి నివేదించారు. దీంతో.. ఓటుకు నోటు వ్యవహారంపై దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము కోరిన వారికి ఓటు వేయాలంటూ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5కోట్లు డీల్‌ కుదుర్చుకోవటం.. దీనికి సంబంధించి రూ.50లక్షలు ఇస్తూ వీడియో టేపుతో సహా పట్టుబట్టటం తెలిసిందే.

ఈ టేపుల విశ్వసనీయతపై వెల్లువెత్తిన అభ్యంతరాన్ని శాస్త్రీయంగా విశ్లేషించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రాధమిక నివేదికను కోర్టుకు సమర్పించటంతో ఈ కేసు వ్యవహారం మరింత ఊపందుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

ఓటుకు నోటు వ్యవహారంలో బయటకు వచ్చిన టేపులు నిజమైనవని తేలిన నేపథ్యంలో.. ఇందులో ఉన్న అంశాలపై తదుపరి విచారణ మొదలు కానుంది. వీడియోలో పేర్కొన్న అంశాలతో పాటు.. ఆ తర్వాత విడుదలైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన ఆడియో టేపునకు సంబంధించి అంశాలపై విచారణ మరింత ముమ్మరం కానుందన్న వాదన వినిపిస్తోంది.



Tags:    

Similar News