పోడు వివాదంలో ఘోరం.. గొత్తికోయల దాడిలో అటవీ అధికారి మృతి

Update: 2022-11-22 15:16 GMT
ఓవైపు తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సమస్యల పరిష్కారంపై కసరత్తు చేస్తుండగా.. మరోవైపు దారుణం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పోడు భూముల సర్వేకు, వాటిలో ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన అధికారులపై సాగుదారులు, నివాసితులు దాడులు చేయడం చూశాం. ఆ సందర్భంగా అధికారులకు గాయాలు కావడం చర్చనీయాంశమైంది. కొన్నిసార్లు అధికారుల ప్రవర్తన సైతం వివాదాస్పదంగా మారింది. అయితే, తమకు అందిన ఆదేశాల ప్రకారమే వారు వెళ్లి బాధ్యతలు నిర్వర్తించడంతో విషయం పెద్దది కాలేదు.

మరోవైపు పోడుదారుల అంశం పార్టీల రాజకీయ ఎంజెడాలో ఉండడంతో ఎప్పటికప్పుడు సమస్య రగులుతోంది. గతేడాది నల్లగొండ జిల్లాలో బీజేపీ-టీఆర్ఎస్ వర్గాలు ఘర్షణలకు దిగాయి. ఇక ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటి వివాదాలు తరచూ వస్తున్నాయి. ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలోనూ పోడు భూముల అంశమై ఇరు గ్రామాల వారు గొడ్డళ్లు, కారంపొడులతో దాడులు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే, వీటన్నటినీ మించి భద్రాద్రి జిల్లాలో మంగళవారం ఘోరం చోటుచేసుకుంది.

వివాదం ఇలా మొదలైంది.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతం ఎర్రబోడు సమీపంలో ప్రభుత్వం పోడు భూముల్లో మొక్కలు నాటించింది. అయితే, వాటిని తొలగించేందుకు గొత్తికోయలు కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. మంగళవారం సైతం ఇలానే జరగ్గా..

అటవీ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు అడ్డుకోబోయారు. దీంతో పోడుభూముల సాగుదారులు ఆయనపై కత్తితో దాడి చేశారు. ఆ సమయంలో మరో అధికారి రామారావు కూడా ఆయనతో ఉన్నారు. అయితే, పోడుదారులు మూకుమ్మడిగా దాడితో బెండాలపాడు అటవీశాఖ సెక్షన్‌ అధికారి రామారావు పరారయ్యారు. దొరికిపోయిన శ్రీనివాసరావుపై కత్తితో దాడి చేశారు. శ్రీనివాసరావు మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చంద్రుగొండు పీహెచ్ సీకి తరలించి చికిత్స అందించారు. విషమంగా ఉండడంతో అక్కడనుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గొత్తికోయల్లో వలస ఆదివాసులు.. ఖమ్మం తరలించినప్పటికీ శ్రీనివాసరావు ప్రాణాలు దక్కలేదు. అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కాగా శ్రీనివాసరావుపై దాడి చేసిన గొత్తి కోయలు వలస ఆదివాసులుగా తెలుస్తోంది.

అసలే పోడు భూముల వివాదం రగులుతున్న నేపథ్యంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి మరణం తీవ్రంగా చర్చనీయాంశం కానుంది. మరోవైపు అటవీ అధికారులకు గతంలోనూ పోడుదారులు, స్మగ్లర్ల నుంచి ఇలాంటి దాడులు ఎదురయ్యాయి. ఒకరిద్దరు మహిళా అధికారులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఆ సమయంలో తమకు ఆయుధాలు ఇవ్వాలని వారు కోరడం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News