అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మ‌న్ అరెస్ట్ !

Update: 2018-05-22 05:25 GMT
ఏపీలో జ‌రిగిన భారీ కుంభ‌కోణం అగ్రిగోల్డ్ స్కాంలో కీల‌క వ్య‌క్తి అయిన వైస్ ఛైర్మ‌న్ అవ్వా సీతారామారావును ఏపీ పోలీసులు వ్యూహాత్మ‌కంగా వ‌ల ప‌న్ని ప‌ట్టుకున్నారు. కొన్ని సంవ‌త్స‌రాలుగా సంచ‌ల‌నంగా మారిన ఈ కేసులో ఏపీకి చెందిన ఎంతో మంది సామాన్యులు బాధితులు. అధిక వ‌డ్డీ ఆశ‌తో జ‌నాన్ని వ‌ల‌లో వేసుకున్న అగ్రిగోల్డ్ నిర్వ‌హ‌కులు వేల‌కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తి ఎన్నో ఆస్తులు సంపాదించారు. ఈ స్కాంలో ఆత్మాభిమానం దెబ్బ‌తిన్న కొంద‌రు ఏజెంట్లు, డ‌బ్బు రాలేదని కొంద‌రు సామాన్యులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా పాల్పడ్డారు.

ఇప్ప‌టికే  ఈ కేసులో ఛైర్మ‌న్‌ తో స‌హా మ‌రికొంద‌రు అరెస్టు కాగా... కీల‌క వ్య‌క్తి అయిన సీతారామారావు మాత్రం త‌ప్పించుకుని తిరుగుతున్నారు.  సీతారామారావు అగ్రిగోల్డ్ కంపెనీ చైర్మన్‌ వెంకట రామారావుకి సోదరుడు. 2011 ఏడాది వ‌ర‌కు ఈయ‌న అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డులో స‌భ్యుడిగా ఉన్నారు.

ముందునుంచే ప‌థ‌కం ప్ర‌కారం న‌డిపిన ఈ స్కాంలో ఆయన అనుకున్న ప్లాన్ ప్ర‌కార‌మే బోర్డు నుంచి తప్పకున్నారు. ఆ త‌ర్వాత ఇది కేసు అవ్వ‌డంతో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిలు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. కానీ  సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో ఇక అరెస్టు త‌ప్ప‌ద‌ని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్ప‌ట్నుంచి ద‌ర్యాప్తు బృందం ఆయ‌న కోసం వెతుకుతోంది.

ఇటీవ‌ల చివ‌రి నిమిషంలో అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మ‌కం ఆగిపోయింది. దీని వెనుక సీతారామారావు హ‌స్తం ఉంద‌ని, ఎస్సెల్‌ గ్రూప్‌ కొనుగోలు చేయకుండా ఆయ‌నే చక్రం తిప్పారని అంటున్నారు. ఢిల్లీ పోలీసుల సాయంతో ఏపీ సీఐడీ అధికారులు అత‌డిని అరెస్టు చేశారు.  దీనికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింప‌గా ఆయన ఢిల్లీలో ఉన్న‌ట్లు క‌నుగుని ట్రాప్ చేశారు. ఏపీ నుంచి వెళ్లిన సీఐడీ అధికారులు ఢిల్లీలో సీతారామారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొదటి నుంచి సీతారామారావు ప్రమేయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి.  పోలీసుల అదుపులో ఉన్న సీతారామారావును విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News