ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ప‌రువు న‌ష్టం కేసు వేస్తా.. ఐపీఎస్ ఏబీవీ.. అనుమ‌తి కోరుతూ.. లేఖ‌

Update: 2022-03-28 15:47 GMT
పెగాసస్ స్పైవేర్ కొనుగోలు, వినియోగం విషయంలో తనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన ఐదుగురిపై పరువు నష్టం దావా వేసేందుకు సాధారణ పరిపాలన శాఖ అనుమతి కోరుతూ.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్ర‌భుత్వానికి తాజాగా లేఖ రాశారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సాక్షి పత్రిక, టీవీతో పాటు సీపీఆర్వో పూడి శ్రీహరిపై పరువునష్టం దావా వేసేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. తన సస్పెన్షన్ విషయంలో తప్పుడు సమాచారంతో కూడిన ఆరు పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను.. స్థానిక, జాతీయ మీడియాకు పూడి శ్రీహరి విడుదల చేశారని ఏబీవీ పేర్కొన్నారు.

సీపీఆర్వో ప్రచారం చేసిన విషయాలు ప్రభుత్వం తనను సస్పెండ్ చేస్తూ జారీ చేసిన జీవోల్లో లేవని స్పష్టం చేశారు. విచారణ జరిగిన సమయంలోనూ తనపై చేసిన దుష్ప్రచారంలోని అంశాలను ప్రస్తావించలేదని వెల్లడించారు. మీడియాలో వచ్చిన కథనాలు తనతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు బాధ కలిగించాయని వెంకటేశ్వరరావు తెలిపారు.

సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శితోపాటు ఆ లేఖ ప్రతిని సీఎస్ సమీర్ శర్మకు పంపించారు. కాగా, పెగాసస్‌ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను ఏబీ వెంకటేశ్వరరావు గతంలోనే ఖండించారు. నిఘా విభాగాధిపతిగా తాను పనిచేసిన కాలంలో పెగాసస్‌ను కొనలేదని.., వాడలేదని తేల్చిచెప్పారు.

 పెగాసస్‌పై ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఫోన్ల గోప్యతపైనా ప్రజలకు అనేక అనుమానాలు న్నాయని.. ప్రజల భయం, ఆందోళనకు తెరదించాలని పేర్కొన్నారు. పెగాసస్‌ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎవరికీ తెలీదన్నారు. ఆ రాష్ట్రంలో నాకు తెలిసిన కొందరు అధికారుల్ని అడిగా.. ఆ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముకోవడానికి వెళ్లినవారు ఆమెను కలిసినప్పుడు.. ఫలానా వారు కొన్నారని ఆమెకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చని వారు నాతో అన్నారని తెలిపారు.

ట్రోజన్లు, మాల్‌వేర్‌లు వంటివీ గ‌తంలో ప్రభుత్వపరంగా వినియోగించలేదని చెప్పారు. 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు వరకూ తాను నిఘా విభాగాధిపతిగా కొనసాగానని.. ఆ తర్వాత రెండు నెలల వరకూ ఏం జరిగిందో తెలుసని చెప్పారు. తన హయాంలో ఫోన్లు ఏవీ ట్యాప్‌ కాలేదన్న భరోసా ఇస్తున్నానని ఇటీవ‌ల ఏబీవీ విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ.. చెప్పారు.

ఇక‌, ఇప్పుడు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న వానిపై ప‌రువు న‌ష్టం కేసు వేస్తాన‌ని ఆయ‌న తెలిపారు. ఈఅయితే.. దీనికి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. సో.. ఆయ‌న లేఖ రాశారు. దీనికి రెండు లేదా మూడు వారాల్లో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌క‌పోతే.. ఆయ‌న నేరుగా కోర్టును ఆశ్ర‌యించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ప్ర‌బుత్వం ఏచేస్తుందో చూడాలి.
Tags:    

Similar News